రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందరూ ఏకం కావాలి పెండింగ్
నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదా తీర్మానం
ఇవ్వాలి అఖిలపక్ష ఎంపిల సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి
విక్రమార్క 28 అంశాలపై సమావేశంలో చర్చ భేటీకి హాజరుకాని
బిజెపి, బిఆర్‌ఎస్ లేటుగా సమాచారం ఇచ్చారు.. మీటింగ్‌కు రాలేమని భట్టికి
లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందే చెబితే వచ్చే వాళ్లమని వ్యాఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని డిప్యూటీ సిఎం పిలుపునిచ్చారు. రాష్ట్ర నిధులపై పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇవ్వాలని భట్టి సూచించారు. రాష్ట్రానికి వచ్చిన నిధులు, రావాల్సిన నిధులపై ఎంపిలకు ఆయన అవగాహన కల్పించారు. పార్లమెంట్ లో రాష్ట్రానికి రావాల్సి నిధులపై ప్రశ్నించాలని డిప్యూటీ సిఎం సూచించారు. త్వరలోనే మరోసారి ఎంపిలతో సమావేశం నిర్వహిస్తామని తేదీని త్వరలో ప్రకటిస్తామని డిప్యూటీ సిఎం తెలిపారు. ముఖ్యంగా మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు, ఫ్యూచర్ సిటీకి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పార్లమెంట్‌లో అనుసరిం చాల్సిన వ్యూహాంపై చర్చించేందుకు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ప్రజాభవన్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన లోక్‌సభ స భ్యులు, రాజ్యసభ ఎంపిలు సమావేశానికి హాజరు కాగా, వీరితో పాటు ఎంఐఎం అధినేత,
హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. బిఆర్‌ఎస్ రాజ్యసభ్య సభ్యులకు కూడా ఆహ్వానం పంపారు. వీరితోపా టు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్‌ను సైతం ఆహ్వానించారు. ఉన్నత భావాలతో ఎంపిల సమావేశం ఏర్పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎంపిలందరూ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి వివరించాలని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. ఉన్నత భావాలతో ఎంపిల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలవడంతో పాటు పార్లమెంట్‌లో సమస్యలను లేవనెత్తాలని భట్టి సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించి అనుమతులు, నిధులు దశాబ్దకాలంగా అపరిశుభ్రంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పలు వేదికల్లో ప్రధాని మోడీ నుంచి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల రీత్యా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం సిఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారని డిప్యూటీ సిఎం తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అయినా కేంద్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉందని, రాష్ట్ర ఎంపిలంతా కలిస్తేనే వీటిని సాధించేందుకు అవకాశం ఉంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒక రోజు ముందు లేదా సమావేశాల మధ్యలో ఢిల్లీలో అఖిలపక్ష పార్టీల ఎంపిల సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి పలు పార్టీల ఎంపిలు హాజరు కాగా, బిజెపి, బిఆర్‌ఎస్ ఎంపిలు దూరంగా ఉన్నారు.
28 అంశాలపై ఈ సమావేశంలో చర్చ
కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం కొనసాగింది. నిధులపై పార్లమెంట్‌లో ఎలా పోరాడాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు. దాదాపు 28 అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. విభజన సమస్యలపై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. 28 అంశాల్లో ముఖ్యమైనవి మెట్రో రెండో దశ, మూసీ ప్రాజెక్టు, బాపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేయడం, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధి, గోదావరి-, మూసీనది లింక్ ప్రాజెక్ట్, హైదరాబాద్ కోసం మురుగునీటి పారుదల మాస్టర్‌ప్లాన్, వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక, బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎస్సీసీఎల్ కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్, పిఎస్డీఎఫ్ కింద పథకాల మంజూరు,
పిఎం కుసుమ్-ఏ, బి, సి కింద కేటాయింపు, తాడిచెర్ల బొగ్గు బ్లాక్-II మైనింగ్ లీజు, వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవిల రుణ పునర్నిర్మాణం, ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం కింద జిఓటిజికి చెల్లించాల్సిన గ్రాంట్ విడుదల, 2014-,15 ఆర్థిక సంవత్సరానికి సిఎస్‌ఎస్ నిధుల విడుదల్లో లోపాన్ని సరిదిద్దాలని, ఎపి బిల్డింగ్, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధిలో తెలంగాణకు వాటా కోసం నిధులను బదిలీ చేయాలని అభ్యర్థన, ఎపి పవర్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన మొత్తానికి సంబంధించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి, తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, రాష్ట్రంలో రైళ్ల కనెక్టివిటీ పెంచాలని విజ్ఞప్తి, ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వెనకబడిన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడం, పిఎం మిత్రా పార్క్ పథకం కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు, అన్కవర్డ్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు సహా పలు ప్రధాన అంశాలను అందులో పొందుపర్చారు.