Wednesday, January 22, 2025

పంచెకట్టుతో రాజన్నను గుర్తుచేస్తున్న భట్టి..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క్ చేపట్టిన పీపుల్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన భట్టి పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతుంది. భట్టి పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకున్న సమయంలో వడదెబ్బ తగలడంతో ఐదు రోజుల స్వల్ప విరామం తీసుకున్నారు. తర్వాత తన పాదయాత్రను తిరిగి  కొనసాగిస్తున్నారు. వెయ్యి కిలో మీటర్లు దాటి ఆయన పాదయాత్ర ముందుకు సాగుతుంది. అయితే పాదయాత్రలో మల్లు భట్టి విక్రమార్క ప్రజ సమస్యలను వింటూ.. వారికి భరోసా కల్పిస్తూ అడుగులు వేస్తున్నారు.

అంతేకాకుండా స్థానికంగా ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. తన  మార్గంలో ఎదురయ్యే కొన్ని ప్రాజెక్టులను  కూడా సందర్శిస్తున్నారు. పలు వర్గాలను కలుస్తూ.. ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే ముఖ్యంగా తన హామీలలో సంక్షేమానికి, ఉపాధికి ఎక్కువగా పెద్దపీట వేస్తున్న మల్లు భట్టివిక్రమార్క.. రాజన్న(దివంగత నేత వైఎస్సార్‌ ) పాలన తీసుకొస్తామని చెబుతున్నారు.

అదే సమయంలో పాదయాత్ర మొత్తం మల్లు భట్టివిక్రమార్క్ వ్యవహరిస్తున్న, డ్రెస్సింగ్ అంతా వైఎస్సార్‌ను తలపించేలా ఉందని పలువురు కాంగ్రెస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పంచెకట్టు నుంచి మొదలుపెడితే.. వైఎస్సార్ మాదిరిగానే తలపాగా.. ప్రజలను చిరునవ్వుతో పలకరించడం.. వారికి భరోసా ఇవ్వడం వంటివి భట్టి విక్రమార్క్ చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పాలన ఎలా ఉండేదో.. ఇప్పుడు ఏం  జరిగిందో వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలకులు ప్రజలకు రావడం చూస్తారని, ప్రజా సమస్యలు వింటారని కూడా చెబుతున్నారు. మొత్తంగా  వైఎస్సార్‌ను ప్రతిబింబించేలా భట్టి అడుగులు ముందుకు పడుతున్నాయి.

అయితే ఇదే సమయంలో.. వైఎస్సార్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పేరుతో పార్టీని స్థాపించి.. రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. ప్రతి అడుగులో రాజశేఖరెడ్డి పేరును ప్రస్తావిస్తూ.. రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెబుతున్నారు. కేసీఆర్ గడిల పాలన కూలదోయడానికి ప్రజలను వైఎస్సార్‌టీపీని గెలిపించాలని కోరుతున్నారు. ప్రజా సమస్య ఏదైనా సరే పోరాటానికి ముందుకొస్తున్నారు. అయితే షర్మిల నిర్వహించిన పాదయాత్ర, నిరసనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం లేదు. ప్రస్తుతం మల్లు భట్టివిక్రమార్క కూడా ఇప్పుడు రాజన్న రాజ్యమనే నినాదంతో ముందుకు సాగుతున్న పక్షంలో షర్మిల పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే గతకొంతకాలంగా కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం చేయబోతున్నారనే ప్రచారం కూడా విస్తృత్తంగా సాగుతుంది. ఇందుకోసం తెరవెనక వైఎస్సార్ ఆత్మగా పేరుపొందిన కేవీపీ రామచంద్రరావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నారు. ఒకవేళ షర్మిల కాంగ్రెస్‌తో జతకట్టిన పక్షంలో.. ఆ పార్టీకి గత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు, రాజన్న  రాజ్యం అనే నినాదంతో ఎంతో కొంత కలిసి వచ్చే అవకాశం కూడా లేకపోదు. మరి షర్మిల  ఏ దారి ఎంచుకుంటారు?.. ఒంటరిగానే ముందుకు సాగుతారా?.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? అనేది రానున్న రోజుల్లో తెలిపోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News