ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలన చేసి దరఖాస్తుదారులకు ప్రజా పాలన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ…. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. బడ్జెట్ అంచనాలకే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు ఉప ముఖ్యమంత్రి.
దోపిడీ చేయకుండా సంపదను ప్రజలకు పంచిపెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని భట్టి విక్రమార్క అన్నారు. కానీ, అమలు చేయని 3 ఎకరాల హామీ మాదిరిగానే 6 గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని కొంత మంది అనుకుంటున్నారని మండిపడ్డారు. వారి ఆలోచనలు సాగవు.. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు, అందుకే శ్వేత పత్రాలను తీసుకొచ్చామన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.