Friday, January 24, 2025

భట్టి పాదయాత్ర @ 100

- Advertisement -
- Advertisement -

మధిర : సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పట్టువదలని విక్రమార్కుడిలా పాదయాత్ర చేస్తున్నారు. ఎండొచ్చినా.. వానొచ్చినా, ఎండ దెబ్బ తగిలినా, పాదయాత్రను మాత్రం ఆయన విడువ లేదు. తాత్కాలికంగా కొంత బ్రేక్ ఇచ్చి మళ్లీ పీపుల్స్ మార్చ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు. మార్చి 16వ తేదీన ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన పీపుల్స్ మార్చ్ శుక్రవారానికి 100వ రోజుకు చేరుకుంది. ఎండ దెబ్బ కారణంగా వైద్యుల సూచనల మేరకు రెండు రోజులు విరామం తీసుకున్న భట్టి మళ్లీ శుక్రవారం నడుం బిగించారు. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి శుక్రవారం ఉదయం పాదయాత్రను మళ్లీ మొదలు పెట్టారు.

కేతెపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. కొప్పోలు గ్రామంలో రాత్రి బస చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజరహత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజురాబాద్, వర్ధన్నపేట, వరంగల్, స్టేషన్ ఘన్‌పూర్, భువనగిరి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్గొండ నియోజకవర్గాల మీదుగా సాగింది. 15 జిల్లాల్లో 32 నియోజకవర్గాల మీదుగా 1150 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగింది.

అన్ని వర్గాలను కలుపుకుపోతూ, టెంటుల్లోనూ ఉంటూ ఈ పాదయాత్ర ద్వారా భట్టి కాంగ్రెస్‌ను ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఇందులో చాలా వరకు విజయం సాధించారు. పండుగలను, పబ్బాలను అన్నింటినీ ప్రజలతోనే జరుపుకున్నారు. పీపుల్స్ మార్చ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటి ముఖం చూడలేదు. ఉగాది, రంజాన్, ఇతర పండుగలనూ ఈ పాదయాత్రలో ప్రజలతోనే జరుపుకున్నారు. విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, బడుగులు అందరినీ ఆయన కలుపుకుంటూ వెళ్లుతున్నారు. ఈ పాదయాత్ర కాంగ్రెస్ నేతలనూ ఏకతాటి మీదికి తేవడంలో చాలా వరకు సఫలమైనట్టు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. కర్ణాటకలో పార్టీ విజయం, భట్టి పాదయాత్ర తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచాయి.

పార్టీ పునరుజ్జీవనం చెందుతున్నదనే ఆశలను ప్రజల్లో రేకెత్తించాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భట్టితో సమావేశమైన సంగతి విదితమే. ఖమ్మంకు చెందిన పొంగులేటి చేరిక సభ అదే జిల్లాలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు కూడా ఖమ్మంలో బహిరంగ సభతో ఉండనుది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా వస్తున్నట్టు ఇది వరకు ఖమ్మం కాంగ్రెస్ అధ్యక్షుడు జావీద్ మీడియాకు తెలిపారు. తెలంగాణ మొత్తం ఖమ్మం సభ వైపు చూపు సారించేలా ఆ కార్యక్రమం నిర్వహిస్తామని పొంగులేటి చెప్పారు. అదే నిజమైతే పార్టీకి మరింత ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా తుది అంకానికి చేరువవుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News