కాంగ్రెస్ నేతలను చూసి బిజెపి భయపడుతోందని.. అందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, సోనియా గాంధీలపై ఈడీ నమోదు చేసిన చార్జీషీట్ కు నిరసనగా హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసు ముందు చేపట్టిన ధర్నాలో డిప్యూటీ సిఎం పాల్గొని మాట్లాడారు. సోనియా, రాహుల్ కేసులకు భయపడరని చెప్పారు. బ్రిటిష్ వారికే ఆ కుటుంబం భయపడలేదని.. మోడీకి రాహుల్ గాంధీ భయపడతారా..? అని అన్నారు. దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతుందన్నారు.
కేసులు పెడతా.. జైల్లో పెడతా అంటే స్వాతంత్య్ర ఉద్యమంలో నెహ్రూ తలొగ్గలేదని చెప్పారు. కుట్రలో భాగంగానే రాహుల్, సోనియా గాంధీలపై కేసు పెట్టారన్నారు. సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టి విచారణకు పిలుస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాలన్నారు. తప్పుడు కేసులు పెట్టే వ్యవస్థ మారాలన్నారు. కార్పొరేట్ సంస్థలపై బీజేపీ ఆధారపడుతోందని భట్టి ఆరోపించారు.