‘బుద్ధిమాంద్యం’.. ‘అజ్ఞానం’ అన్న వ్యాఖ్యలతో అట్టుడికిన
అసెంబ్లీ హరీశ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బడ్జెట్ పరిధి దాటి
రాజకీయ ప్రసంగాలు ఎందుకని నిలదీత సభా
నాయకుడినే అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యాఖ్యలు
ఉపసంహరించుకోవాలని స్పీకర్ సూచన రాష్ట్ర
రహదారులపై హరీశ్, కోమటిరెడ్డి మధ్య వాగ్యుద్ధం గ్రామీణ
రహదారులపై టోల్ వేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్ టోల్ వేయబోమని
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి బిఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట,
గజ్వేల్‌లోనే రోడ్లు వేశారని కోమటిరెడ్డి ఆరోపణ సింగరేణి నిధులను ఈ
రోడ్లకు వాడారని ఆగ్రహం కమీషన్లు రావనే రహదారులు వేయలేదని
గత పాలకులపై విమర్శ రాష్ట్రమంతా తిరిగి రోడ్లు చూద్దామా అని కోమటిరెడ్డి
సవాల్ అంగీకరించిన హరీశ్ రుణమాఫీపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల మధ్య
వాగ్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు రూ.1700కోట్ల అప్పు చేస్తోందని
బిజెపి నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హరీశ్ రావు సభలో మాట్లాడుతూ ’బుద్ధిమాం ద్యం’ అని వ్యాఖ్యానించడంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశా రు. హరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుండా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకు హరీశ్ రావు స్పందిస్తూ బుద్ధిమాంద్యం అనే పదం ఏమైనా తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టలూడదీసి కొడతా…బట్టలిప్పి ఊరేగిస్తానని మాట్లాడితే వారిని ఎందుకు వారించలేదని ఆయన స్పీకర్‌ను అడిగారు. తాను బుద్ధిమాంద్యం అంటే తప్పెలా అవుతుందని, దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. హరీశ్ రా వు విజ్ఞులైతే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని భట్టివిక్రమార్క సూచించారు. సభాపతితో వాదన సరికాదన్నారు.
హరీశ్ రావు స్పందిస్తూ స్పీకర్ పట్ల తమకు గౌరవభావం ఉందన్నారు. స్పీకర్ అందరికీ పెద్దన్నలాంటి వారని, తమ ఆవేదనను స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి తెలియచేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సభాపతి సైతం వాదనలు ఎందుకని ఘాటుగా స్పందించారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రతిపక్ష బిఆర్‌ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా ఉన్న సమయం కంటే ఎక్కువ సమయం హరీష్‌రావు తీసుకున్నారని, తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు అసలు మాట్లాడనిచ్చారా అని ఎదురుదాడి చేశారు. ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై విపక్ష సభ్యుడు హరీశ్ రావు మాట్లాడుతూ బడ్జెట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాగా నీతులు చెప్పారని, గత ఏడాది బడ్జెట్ తో పోలుస్తూ ఆధికార పార్టీపై విరుచుకుపడ్డారు. గత ఏడాది అంచనాలు పెంచి చూపించారని, ఇప్పుడు బడ్జెట్ అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు కృష్ణా జలాల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్న నాడు ఇదే పార్టీ ఎల్‌ఆర్‌ఎస్ వద్దని ఆర్భాటం చేసిందని, అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్‌ఎస్ పేరిట ప్రజల ముక్కు పిండి పైకం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవికతకు బడ్జెట్ దూరంగా ఉందని, ఆరు గర్యారంటీలు ఆవిరైపోయాయాని విమర్శించారు. బడ్జెట్ లో 4 వేల రూపాయల పెన్షన్ ఊసే లేదన్నారు. సర్కార్ చెప్పే తెలంగాణ రైజింగ్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఇప్పుడు భూములు లాక్కుంటున్నారని, ఇపుడు భూములు అమ్ముదామంటున్నారని ధ్వజమెత్తారు. రైతుభరోసా సాయం సగం మందికి కూడా అందలేదని, ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెడతారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అమ్మకానికి పెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఈ బడ్జెట్లో కేవలం రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లుగా చూపించారని అన్నారు. ఈ క్రమంలోనే చేతకాని వారెవరు..మాట తప్పిందెవరని ప్రశ్నించారు.
రైతు భరోసా పథకం పేరు మార్చేశారు కానీ, డబ్బులు ఇవ్వలేదని, కౌలు రౌతులకు రైతు బీమా, వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాలు పూర్తిగా అవాస్తవికంగా ఉన్నాయని, బీఆర్‌ఎస్ హయాంలో చేసి అప్పు రూ.4.22 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాళా తీసిందని బహిరంగ వేదికలపై పదేపదే చెప్పడం సరికాదన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.22 వేల కోట్లు గ్రాంట్లు వస్తున్నాయని చెప్పారని, కానీ రూ.10 వేల కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని హరీశ్ రావు అన్నారు. వంటంతా అయ్యాక గంటె తిప్పినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి పదిహేను నెలల అవుతున్నా ఆ ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు.
ఈ ఏడాదైనా ఉద్యోగాలు ఇస్తారని ఎదురుచూసిన వారి ఆశలపై భట్టి విక్రమార్క బకెట్ల కొద్ది నీళ్లు చల్లారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు అశోక్‌నగర్ చుట్టూ ప్రదక్షిణ చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇచ్చి మాట నిలబెట్టుకుంటామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను పార్టీ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పారని, కానీ నేడు నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు. 60 నుంచి 80 శాతం మాత్రమే ఉండే స్థానిక రిజర్వేషన్‌ను 95 శాతానికి సాధించింది కేసీఆరే అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. అన్నీ అబద్దాలే చెబుతున్నారని, ఉద్యోగాలపై ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ నియామక పత్రాలు ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.
రాష్ట్ర రహదారులు, గ్రామీణ రోడ్లకు ’నో టోల్’ -: ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
రాష్ట్ర రహదారులకు, గ్రామీణ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామని వివరించారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కే రోడ్లు వేశారని విమర్శించారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులను సైతం వాడారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. రోడ్ల విషయంలో ఛాలెంజ్ చేస్తున్నానని, రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్‌రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కూడా హరీశ్‌రావు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్‌అండ్‌బీ పనుల గురించి లెక్కలు తీద్దామని అన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు రూ. 1,700 కోట్లు అప్పు : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 8.6 లక్షల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమిషానికి రూ. 1 కోటికి పైగా అప్పు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రుణభారం రూ. 2.27 లక్షలుగా ఉందని వెల్లడించారు. ఇంత భారీ స్థాయిలో రుణాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. యూపీఏ హయాం కంటే ఎన్డీయే హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రాలకు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటాను 10 శాతం పెంచి 42 శాతానికి చేర్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటాను పెంచినప్పటికీ విమర్శలు చేయడం సముచితం కాదని ఆయన హితవు పలికారు.