హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హడావిడిగా ఏపీ విభజన చేసిందని రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహిగా ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఏపి, తెలంగాణా రాష్ట్ర విభజన చట్టం-2014లో పేర్కొన్న ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల అభీష్టం మేరకు ఇచ్చిన కాంగ్రెస్ ను విమర్శించడం సిగ్గు చేటుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని ముందే తెలిసినప్పటికీ, పార్లమెంట్ లో యూపీఏ, ఎన్డీఏ పక్షాలను ఒప్పించి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టబద్దంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియమ్మకే దక్కుతుందన్నారు. ఆనాడు పార్లమెంట్లో లేని మోడీ ఇప్పుడు రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ విభజన జరగలేదని ఆనాడు బీజేపీ శాసనసభాపక్ష నేత సుష్మాస్వరాజ్ చెబితే బాగుండేదని అన్నారు. కానీ నాడు పార్లమెంటులో లేని మోడీ తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆనాడు దురదృష్టవశాత్తు మోడీ చట్టసభలో ఉండి ఉంటే ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఉండేది కాదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించిన ఏడు మండలాలను (రెండు లక్షల ఎకరాలను) ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ప్రధాని మోడీ తెలంగాణకు ద్రోహం చేశాడని మండిపడ్డారు. అనేక చర్చల తర్వాతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని, రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటులో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకోకూడదని కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాజ్యసభలో అమరవీరుల ఆత్మబలిదానాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించి తెలంగాణ జాతిని మోడీ అవమానించారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను సమ భావంతో చూసేలా ప్రధాని ప్రసంగం ఉండాలన్నారు. కానీ మోదీ ఇంత దిగజారి మాట్లాడటం వెనుక విభజించు లబ్దిపొందే అన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం బయట పడిందని ఫైర్ అయ్యారు.
విభజన చట్టంలో పేర్కొన్న కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదం, గిరిజన యూనివర్సిటీ మంజూరు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, కాజీపేట రైల్వేవే కోచ్ ఫ్యాక్టరీ సమస్యలను పరిష్కరించని మోడీ సర్కార్ కాంగ్రెస్ పై అవాకులు చవాకులు పేల్ఛడం సిగ్గు చేటుగా ఉందన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.900 కోట్లు రావాల్సివుందని, నవోదయ, కేంద్రీయ పాఠశాలలు, ఐఐటి, ఐఐఎమ్, ఐఐఎస్సి విశ్వ విద్యాలయాలు ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టాన్ని తుంగలో తొక్కి రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా లేకుండా బిజెపి ప్రభుత్వం కారణమైందని ధ్వజ మెత్తారు.
Bhatti Vikramarka slams on PM Modi