Wednesday, January 22, 2025

దేశ సంపదను మోడీ కార్పొరేట్లకు పంచుతున్నాడు..

- Advertisement -
- Advertisement -

Bhatti Vikramarka slams PM Modi over fuel price hike

అచ్చే దిన్ కాదు సచ్చె దిన్
వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల
దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలకు అచ్చే దిన్ తీసుకొస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ రోజు రోజుకు ధరలను పెంచుతూ ప్రజలకు సచ్చే దిన్ తీసుకువచ్చాడని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. 2014 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 350 రూపాయల ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోడీ సర్కార్ 8 ఏళ్ల పాలనలో 1,050 రూపాయలకు పెంచి ప్రజలపై తీవ్రమైన భారాలు మోపిందని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మల్లు గురువారం చింతకాని మండలం పాతర్ల పాడు నుంచి రైల్వే కాలనీ, నాగులవంచ, సీతంపేట, చిన్న మండవ గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అచ్చే దిన్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, టోల్ చార్జీల ధరల పెంచడంతో పాటు పేద, సామాన్యులు జ్వరం వస్తే వేసుకునే గోలీల పైన కూడా పన్నుల భారం వేయడమేనా అని విమర్శించారు. పేదలపై పన్నుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు బడ్జెట్లో రాయితీలు కల్పించి సబ్ కా వికాస్ అని ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలి అని విమర్శించారు. డీజిల్ ధర వంద రూపాయలు దాటితే దాని ప్రభావం వ్యవసాయం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మీద పడిందని వివరించారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో పేద సామాన్యులకు ఒరిగిందేమీ లేదని బడా కార్పొరేట్ శక్తులకు మాత్రం దేశ సంపదను పంచి పెడుతున్నారని దుయ్యబట్టారు. బిజెపి అవలంబింస్తున్న విధానాలు, మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ధరలు పెంచడం లో కేంద్రంతో పోటీపడుతూ రాష్ట్రప్రభుత్వం కూడా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల పైన భారం వేస్తున్నదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్న ధరలతో పేద, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకై పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నానని వివరించారు.

పాదయాత్రలో తనతో కలిసి వేసిన అడుగుల సవ్వడి పాలకుల గుండెలదిరే విధంగా ఉండాలని, ఇందుకోసం తాను తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తన అడుగుల్లో అడుగులు వేస్తూ ప్రజలు కదం తొక్కితే పాలకుల కోటలు కూలిపోతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు తీసుకొస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు తో పాటు రైతులకు వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇస్తామని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించేలా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని ఇది రాజకీయ ఎన్నికల యాత్ర కాదని స్పష్టం చేశారు. చింతకాని మండలం పాతర్ల పాడు నుంచి రైల్వే కాలనీ, నాగులవంచ, సీతంపేట, చిన్న మండవ గ్రామాల్లో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర జన జాతరను తలపించింది. సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చి పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించారు.

Bhatti Vikramarka slams PM Modi over fuel price hike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News