Sunday, January 19, 2025

సాధారణ కార్యకర్త నుంచి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి చెందిన మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు 1961 జూన్ 15న భట్టి విక్రమార్క జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్శిటీ నుంచి 1986లో ఎంఏ (చరిత్ర) పీజీ పూర్తి చేశాడు. మల్లు భట్టి విక్రమార్కకు నందినితో వివాహం జరగ్గా.. సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య ఇద్దరు కుమారులున్నారు.

మల్లు భట్టి విక్రమార్కది ముందు నుంచే రాజకీయ కుటుంబం. మల్లు కుటుంబంలో భట్టి విక్రమార్క కంటే ముందే.. అనంత రాములు, మల్లు రవి రాజకీయంలో ఉన్నారు. మల్లు అనంత రాములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఆకస్మిక మరణంతో మల్లు రవి నాగర్ కర్నూల్ నుంచి ఎంపిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం.. జడ్చర్ల నుంచి మల్లు రవి ఎంఎల్‌ఎగా కూడా తెలిచారు.

మల్లు అనంతరాములు మరణం తర్వాతే భట్టి విక్రమార్క కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సిఎంగా ఉన్న సమయంలో పార్టీలో భట్టి చురుకుగా వ్యవహరించారు. 2007లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఎల్‌సిగా భట్టి గెలుపొందారు. 2009 వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన భట్టి అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసి గెలిచారు. అప్పటివరకు సిపిఎం కంచుకోటగా ఉన్న మధిరలో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు.

ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా 2023లోనూ విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2011 వరకు చీఫ్ విప్‌గా మల్లు భట్టి విక్రమార్క పని చేశారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2018లో తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేతగా భట్టి ఎన్నికయ్యారు. 1990-92 వరకు ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్‌గా మల్లు భట్టి విక్రమార్క పనిచేశారు. 2000-2003 వరకు పిసిసి సెక్రటరీగా మల్లు భట్టి విక్రమార్క కొనసాగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News