Monday, December 23, 2024

ఎవరు లేకున్నా చింతన్ శిబిర్ ఆగదు: భట్టి

- Advertisement -
- Advertisement -

Bhatti Vikramarka tells details of Chintan Shivir program

మన తెలంగాణ/హైదరాబాద్: ఎవరు లేకున్నా చింతన్ శిబిర్ కార్యక్రమ నిర్వహణ ఆగదని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పరోక్షంగా పిసిసి చీఫ్ రేవంత్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అవసరాలను బట్టి కొందరు అందుబాటులో ఉంటారు, కొందరు ఉండరని కామెంట్ చేశారు. ఇది ఎఐసిసి కార్యక్రమని, ఎవరి కోసం కార్యకలాపాలు ఆగవని భట్టి స్పష్టం చేశారు. అలాగే దీన్ని ప్రత్యేకంగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆయన హితవు పలికారు. చింతన్ శిబిర్ నిర్వహణకు సంబంధించిన వివరాలను మంగళవారం మీడియాకు తెలియజేశారు. కీసరలో రెండు రోజుల(బుధ, గురువారాల్లో) పాటు నిర్వహిస్తున్న “నవ సంకల్ప్ మేథో మథన శిబిర్‌” సమావేశాలు తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతాయన్నారు. దశాబ్దాల తరబడి పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపైన నవ సంకల్ప శిబిరంలో లోతుగా చర్చిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం రోడ్ మ్యాప్ సిద్ధం చేసి 2023 సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

నవ సంకల్ప మేధోమథన శిబిరంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించడానికి ఆరు కమిటీలను వేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కో కమిటీలో ఒక సీనియర్ నాయకుడు కన్వీనర్‌గా, 25 నుంచి 30 మంది సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. మొదటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు వారికి అప్పగించిన అంశంపైన కమిటీలో లోతుగా చర్చించి వారి చర్చల్లో వచ్చిన సారాంశాన్ని నిర్ణయాలుగా నివేదిక రూపంలో నవసంకల్ప్ ప్రధాన కమిటీకి రెండవ రోజున అప్పగిస్తారని ఆయన తెలిపారు. 6 కమిటీల నుంచి వచ్చిన నిర్ణయాలను మెయిన్ కమిటీ క్రోడీకరించి పిఎసిలో ప్రవేశపెట్టి ఆ కమిటీలో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పాలసీగా మేథో మథనం శిబిరం నిర్ణయాలను రెండవ రోజు సాయంత్రం ప్రకటిస్తామని వివరించారు. ఈ కమిటీలో ఉండే సభ్యులు భేషజాలకు వెళ్లకుండా, అరమరికలు లేకుండా, తమ అభిప్రాయాలు నిర్భయంగా, స్పష్టంగా, ఆలోచన విధానాలను చర్చించాలని ఆయన సూచించారు. ఒకే సభ్యుడు రెండు మూడు కమిటీలో ఉన్నట్లయితే వారి అభిప్రాయాలను, సలహాలు, సూచనలను లిఖితపూర్వకంగా సంబంధిత కమిటీ కన్వీనర్‌కు అప్పగించాలని కోరారు.
కమిటీ కన్వీనర్లుగా
పొన్నాల లక్ష్మయ్య, (ఆర్గనైజేషన్ కమిటీ కన్వీనర్), ఉత్తమ్ కుమార్ రెడ్డి, (పోలిటికల్ కమిటీ కన్వీనర్), జీవన్ రెడ్డి (వ్యవసాయ కమిటీ కన్వీనర్), దామోదర రాజనర్సింహ(యూత్ కమిటీ కన్వీనర్),  శ్రీధర్ బాబు,(ఎకానమీ కమిటీ కన్వీనర్), వి.హనుమంతరావు (విహెచ్) (సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కమిటీ కన్వీనర్)లు ఉన్నారు.
జూన్ 2న గాంధీభవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
జూన్ 2వ తేదీన హైదరాబాద్ గాంధీ భవన్‌తో పాటు పార్టీ జిల్లా కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని ఆయన సూచించారు.

Bhatti Vikramarka tells details of Chintan Shivir program

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News