Sunday, January 19, 2025

భట్టి పీట వివాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యాదగిరిగుట్ట లో బ్రహ్మోత్సవాల తొలిపూజ కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. సోమవారం యాదగిరిగిగుట్ట బ్రహ్మోత్సవాల తొలిపూజలో సిఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.ఈ సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అక్కడ ఏ ర్పా టు చేసిన పీటలపై కూర్చోగా డిప్యూటీ సిఎం భ ట్టి విక్రమార్క, మహిళా మంత్రి కొండా సురేఖ నేలపై చిన్న పీటపై కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దళిత సామాజిక వర్గానికి చెంది న ఉప ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ బిఆర్‌ఎస్ నేతలు, బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా వివిధ వర్గాల నేతలు విమర్శలు గు ప్పించగా, కౌంటర్‌గా కాంగ్రెస్ నేతలు ఆ విమర్శలను తిప్పికొట్టారు.

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల తొలి పూజ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ బ్లడ్‌లోనే సమానత్వం ఉందని, కాంగ్రెస్ అంటేనే ఆకాశమంత సమానత్వం అని పార్టీ శ్రేణులు ట్వీట్లు చేశారు. భారత్ జోడో యాత్ర సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి టిఫిన్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పార్టీ శ్రేణులు చేసిన ట్వీట్లను రీట్వీట్లు చేసింది.
దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్‌కు తెలుసు : మల్లు రవి
దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు అని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బిఆర్‌ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు. గత బిఆర్‌ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే సిఎల్‌పి విలీనం అంటూ కొత్త కథ అల్లి భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు భట్టి విక్రమార్కకు అవమానం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి దళితులను మోసం చేసిన బిఆర్‌ఎస్ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరని అన్నారు. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తుంది : అడ్లూరి లక్ష్మణ్
యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని ఉద్దేశపూర్వకంగా బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. కెసిఆర్ దళితుడిని సిఎం చేస్తానని చెప్పి, దళిత మంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటికొండ రాజయ్యలను ఎలా అవమానించారో ప్రజలు చూశారని అన్నారు. కెసిఆర్‌ను దళిత మంత్రులు ఎన్ని సార్లు కలిశారని అడిగారు. కెసిఆర్ హయాంలో ఎంతమంది దళితులకు భూములు,ఇండ్లు ఇచ్చారు..? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి : ఎంఎల్‌సి కవిత డిమాండ్
అగ్రవర్ణాలకు సంబంధించిన సిఎం రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బిసి మంత్రి కొండా సురేఖను అవమానించారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది చాలా దౌర్భాగ్యమని.. సిఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆమె సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని గుర్తు చేశారు. అప్పుడు ఓపికపట్టామని.. ఇవాళ సాక్షాత్తు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా భట్టి విక్రమార్కను అవమానించారన్నారు.సిఎం వెంట నే భట్టి విక్రమార్క, కొండా సురేఖలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది : ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించి, కాంగ్రెస్ తన నిజ స్వరూపం బయటపెట్టిందని బిఎస్‌పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇది యావత్ దళిత జాతిని అవమానించినట్లేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిత్యం ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన, ఆరు గ్యారంటీలంటూ ఉదరగొడుతున్న పాలకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అవమానించారని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేద ప్రజలంటే గౌరవం లేదన్న ఆయన జన్వాడలో దళితులపై దాడి జరిగితే ఖండించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పేద వర్గాలపై ఓట్ల కోసం కపట ప్రేమ ఒలకబోస్తుంది తప్ప, నిజంగా దళితులపై ప్రేమలేదని, విద్వేషం ఉందని ఆరోపించారు. అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ పాటించకుండా దళితులను అవమానించడం దారుణమన్నారు.
దేవుడి సాక్షిగా డిప్యూటీ సిఎంకు అవమానమా : బాల్క సుమన్
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి..?… ఎవరికి చెప్పుకోవాలి..? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైనా భట్టి విక్రమార్కనే అవమానించారన్నారు. 74 యేండ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ దళిత జాతిని ఈరోజు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి భట్టి విక్రమార్క ఫోటో పక్కన పెడుతున్నారని…. ప్రభుత్వ యాడ్స్‌లో డిప్యూటీ సీఎం ఫోటోను పక్కన పెట్టారని చెప్పారు. జరిగిన ఘటనపై నయా దేశ్ ముఖ్ సిఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలి : ఎర్రోళ్ల శ్రీనివాస్
యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనమని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు జరిగిన అవమాన ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News