భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం నిత్యనూతన చైతన్య స్రవంతిగా వెలుగొందుతూనే ఉంది. ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి ‘బి.ఎన్.రెడ్డి’గా ప్రాచుర్యం పొంది భూస్వాముల ఆగడాల్ని, రజాకార్ల అకృత్యాల్ని నిలువరించేందుకు స్వయం గా తుపాకీ చేతబట్టి పేదల కోసం అవిశ్రాంతంగా ఉద్యమించారు. నిర్దిష్టంగా చెప్పాలంటే బి.ఎన్. రెడ్డిని ‘తెలంగాణ సాయుధ పోరాట దళానికి తొలి తరం గెరిల్లా’గా అభివర్ణించవచ్చు. తెలంగాణ సాయుధ పోరాట నాయకులలో ఒకరుగా నిలిచిన బి.ఎన్. రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని (ప్రస్తుత సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో 1922 మార్చి 15 నాడు భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పదో తరగతి వరకు అభ్యసించారు.
తదనంతరం ఆయన వీర తెలంగాణ సాయుధ పోరాట బాటపట్టారు. బి.ఎన్.రెడ్డి భూస్వామ్య కుటుంబంలో జన్మించిననూ ఆయన ఆలోచనలు, ఆశయాలు మాత్రం సమసమాజం వైపుగా పయనింపజేశాయి. ఆయన 1945లో వితంతువు సరోజను ఆదర్శ వివాహం చేసుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆంధ్ర మహాసభలో కార్యకలాపాల్లోనూ కీలకపాత్ర వహించి ‘దున్నేవాడిదే భూమి’ అంటూ నినదించి వంద ఎకరాల తన భూమిని పేద ప్రజలకు పంచిన నిస్వార్థ త్యాగశీలి బి.ఎన్. రెడ్డి. చాకలి ఐలమ్మ పోరాటం నుంచి భూస్వామి విసునూరి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సాగించినపోరాటంలో ఆయన అగ్రభాగంలో నిలబడి ఉద్యమించారు. అలా స్థానిక భూస్వాముల, జమీందారుల నిరంకుశత్వానికి, వెట్టిచాకిరి విధానానికి వ్యతిరేకంగా, రజాకారుల అరాచకాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో బి.ఎన్.రెడ్డి ఆ ఉద్యమ చివరి దశ వరకు వీరోచిత పోరాటం సాగించారు.
ఆ రకంగా ఆయన ‘తెలంగాణ ఉద్యమానికి సాయుధ సేనానిగా నిలిచి భూస్వాములకు, నిజాంకు, రజాకారులకు వ్యతిరేకంగా సాయుధ పోరాట సమరాన్ని సాగించారు’. బి.ఎన్. రెడ్డి సాయుధ పోరాట సమయంలో తాను నాయకత్వం వహించిన కార్యకలాపాలను నమోదు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. బి.ఎన్.రెడ్డి నిజాం హయాం లో రజాకార్లతో ఆరేళ్లపాటు అండర్ గ్రౌండ్‌లో ఉంటూ పోరాడారు. ఆయన పలు హత్యా ప్రయత్నాల నుండి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. బి.ఎన్. రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అనునిత్యం ప్రజాపోరాటాల్లో నడుం బిగించారు. బి.ఎన్.రెడ్డి 1957, 1967లలో రెండుసార్లు తుంగతుర్తి , సూర్యాపేటల నుంచి ఎంఎల్‌ఎగా ఘన విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ )లో చేరారు.
మిర్యాలగూడ నియోజకవర్గం 1962లో ఏర్పాటు చేయబడింది. 1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బి.ఎన్.రెడ్డి మిర్యాలగూడ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. 1971లో మూడోసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బి.ఎన్.రెడ్డి సి.పి.ఎం పార్టీ నుంచి మొదటిసారి లోక్‌సభకు పోటీ చేసి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి కె.జితేందర్రెడ్డిపై విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిని ఓడించి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సి.పి.ఎం నాయకుడు బి.ఎన్.రెడ్డి ఒక్కరే కావడం గమనార్హం.1971లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు ఆయన సమైక్యవాదంపై గట్టిగా నిలబడ్డారు.
ఆ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో బి.ఎన్.రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అయిన జి.ఎస్.రెడ్డితో తలపడి అపజయం పాలయ్యారు. అదే విధంగా బి.ఎన్.రెడ్డి 1980లో కూడా జి.ఎస్.రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చకిలం శ్రీనివాసరావుపై రెండోసారి లోక్‌సభ సభ్యునిగా బి.ఎన్.రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో బి.ఎన్.రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో బి.ఎన్.రెడ్డి ఆరవసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బద్దం నర్సింహారెడ్డిపై మూడోసారి విజయం సాధించారు. ఈ రకంగా బి.ఎన్.రెడ్డి సి.పి.ఎం పార్టీ నుండి మూడుసార్లు 1971, 1984, 1991 లలో మిర్యాలగూడ పార్లమెంటు నియోజకవర్గం ఎం.పి. గాను ఘన విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. అసెంబ్లీ, పార్లమెంటులలో సామాన్యులు ఎదుర్కొంటున్న అనేకసమస్యలను ఆయన లేవనెత్తారు. అలా ఆయన ‘పాతిక సంవత్సరాల పార్లమెంటరీ జీవితంలో మచ్చలేని కమ్యూనిస్టు ప్రజాప్రతినిధి’గా పేరు ప్రఖ్యాతులు పొందారు.
రెండుసార్లు ఎంఎల్‌ఎగాను, మూడు సార్లు ఎంపిగాను గెలిచి నిలిచి సరికొత్త చరిత్రని సృష్టించిన బీఎన్ రెడ్డి చాలా సాదాసీదాగా ఉండేవారు. ఆయన చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు. సుదీర్ఘకాలం పాటు ప్రజాపదవుల్లో ఉన్ననూ ఆయన అనునిత్యం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమించారు. ఆయన తనకోసం ప్రత్యేకంగా సంపాదించుకున్నది ఏమి లేదు. ఆయన పార్లమెంటు సమావేశాలకు ఎప్పుడూ ప్రభుత్వ వాహనాలలోనే ప్రయాణించారు. ఈ తరం నేతలు అలాంటి నేతల జీవితాల నుంచి ఆదర్శాలు స్వీకరించి పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన బి.ఎన్. రెడ్డి అదే భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి లక్షలాది ఎకరాల భూమిని భూస్వాముల బారి నుండి విముక్తి చేసి పేదలకు పంచడంలో విశిష్ట పోరాటాలు నిర్వహించారు. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా పోరాట ఉద్యమాల్లో పీడిత జననేతగా వెలుగొందిన బి.ఎన్.రెడ్డి 2008 మే 9 నాడు మరణించారు. ఏది ఏమైననూ బి.ఎన్.రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకొని వేనోళ్ళ సజీవంగా కొనియాడబడుతున్నారు.
జె.జె.సి.పి. బాబూరావు
94933 19690