న్యూఢిల్లీ : స్థానిక జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం వేలాది మంది భీమ్ ఆర్మీ మద్దతుదార్లు గుమికూడి ప్రదర్శనకు దిగారు. తమ నేత చంద్రశేఖర్ ఆజాద్‌పై ఇటీవల యుపిలో జరిగిన దాడికి నిరసన తెలిపారు. వెంటనే ఆయనకు జడ్ ప్లస్ భద్రతావలయం ఏర్పాటు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షులు, భీమ్ ఆర్మీ సహ వ్యవస్థాపకులు అయిన చంద్రశేఖర్‌పై గత నెల 28న యుపిలోని సహ్రాన్‌పూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.
తమ నేతకు ప్రాణహాని తలపెట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆయన మద్దతుదార్లు తెలిపారు. ధర్నా నిరసనల కార్యక్రమంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలతో పాటు మిత్రపక్షాలైన రాష్ట్రీయలోక్‌దళ్, సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. తమ నేత తీవ్రస్థాయి ముప్పులో ఉన్నట్లు, వెంటనే ఆయనకు జడ్ ప్లస్ భద్రత అవసరం అని ఎన్నిసార్లు తెలిపినా కేంద్రం కానీ యుపిలోని బిజెపి ప్రభుత్వం కానీ స్పందించడం లేదని, అందుకే తాము రాజధానికి వచ్చి నిరసనకు దిగామని భీమ్‌ఆర్మీ నేతలు తెలిపారు.