కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి
బిజెపి, బిఆర్‌ఎస్ నుంచి బరిలో బిసి అభ్యర్థులు
కెతావత్ తిరుపతి నాయక్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోనే ఆరు జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలతో కూడిన అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఓట్ల పండగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నం నుంచి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాలోని జనగామ నియోజకవర్గం, సిద్దిపేటలోని చేర్యాల వరకు విస్తరించిన భువనగిరి లోక్‌సభ స్థానాల్లో పార్టీల అభ్యర్థులు తమ భవిష్యత్ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.
ఇప్పటికే బిజెపి నుంచి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, బిఆర్‌ఎస్ నుంచి క్యామ మల్లేశం పేర్లను ఆ పార్టీలు ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించింది. అందులో ఇద్దరు బిసి అభ్యర్థులు కాగా, ఒక్కరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. నర్సయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అనుబంధం ఎక్కువగానే ఉంది. ఐతే బిఆర్‌ఎస్, బిజెపిలకు చెందిన ఇద్దరు బిసి అభ్యర్థులు బిసి ఓటర్లు ఎక్కువగా ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వా? నేనా? అని తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
వారిద్దరి మధ్య కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి రావడం.. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే కాంగ్రెస్ తరపున ప్రజలకు గుర్తుకు వచ్చేది సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాత్రమే అని తెలుస్తుంది. ఆయన కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఇంకా బలంగా నమోదు కాలేదు. బిఆర్‌ఎస్, బిజెపిలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు క్యామ మల్లేశం, బూర నర్సయ్య గౌడ్ ఇద్దరూ బిసి సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ తమ ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారన్నది వేచి చూడాల్సిందే.
ఆరింట కాంగ్రెస్ ఎంఎల్‌ఎలే…
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగామ, అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనగామలో మాత్రం బిఆర్‌ఎస్ అభ్యర్థి గెలవగా, మిగతా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. వారిలో నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, క్యామ మల్లేశ్‌తో తలపడుతున్నారు.
త్వరలోనే ప్రచారంలోకి చామల…
అభ్యర్థిత్వం ఖరారు కావడంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈసందర్భంగా త్వరలోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అదే సమావేశంలో ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించి ప్రతి నియోజకవర్గంలో ప్రచా రం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ ముఖ్య నాయకుడొకరు తెలిపారు.