Wednesday, January 22, 2025

భూత్పూర్ కేంద్రంగా.. భూదాన్ భూముల చీకటి డీల్

- Advertisement -
- Advertisement -

సుమారు ౩౦ ఎకరాలు స్వాహా

దీని విలువ రూ. 100 కోట్లకు పైగానే?

లంచాలు మెక్కి నాలా ఇచ్చిన స్థానిక రెవెన్యూ అధికారులు 

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు

భూ మాఫియాలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు కుమ్మక్కు
అధికారులకు మామూళ్ల ఎర, దర్జాగా విక్రయాలు

మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో : కంచె చేను మేసింది.. కంటిని కాపాడాల్సిన కనురెప్పనే కంటిని కాటేసింది. ప్రభుత్వ భూముల, అసైన్డ్, భూధాన్, వక్ఫ్ బోర్డు భూములను కాపాడాల్సిన ప్రభుత్వాధి కారులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులే కబ్జా చేశారు. ఇది ఏ ఎకరనో లేక రెండు ఎకరాలో కాదు. ఏకంగా దాదాపు ౩౦ ఎకరాల భూదాన భూములు. దాని విలువ సుమారు రూ. 1౦౦ కోట్లపై మాటే ఉంటుందని అంచనా. ఈ భూములను చట్ట ప్రకారం అమ్మకూడదు, అన్యాక్రాంతం చేయకూడదు. అయినప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పార్టీలను పక్కనబెట్టి అందిన కాడికి దోచుకుందామని స్కెచ్ వేశారు. ఇందుకు స్థానిక రెవెన్యూ శాఖ అధికా రులకు మామూళ్లు ఆశ చూపి లోబర్చుకున్నారు. ఇందుకు వారు కూడా సై అన్నారు. ఇంకేముంది చట్టాలని చుట్టాలుగా మార్చుకొని తమకు అనుకూలం గా మార్చుకున్నారు.

చట్టాలని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చట్టాన్ని తుంగలో తొక్కి నాలా కన్వర్షన్ ఇచ్చారు. దర్జాగా ఆ భూముల్లో అక్రమ వెం చర్ వేసుకొని ప్లాట్లుగా మార్చి వ్యాపారంగా మార్చుకున్నారు. దీంతో అసలైన భాదాన్ బాదితులు లబోదిబోమంటున్నారు. అక్రమ వెంచర్‌పై చర్యలు తీసు కోవాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు కూడా పైసలకు కక్కుర్తి పడ్డారో ఏమో తెలియదు కానీ అటువైపు వెళ్లడం లేదు. మొత్తానికి అందరూ చేసుకొన్న చీకటి డీల్ కుదిరింది. కోట్లు విలువైపు భూదాన్ భూములు హాంఫట్ అయ్యాయి.

భూత్పూర్ కేంద్రంగా : జాతీయ రహదారి పక్కన ఉన్న భూత్‌పూర్ మున్సి పాల్టీ ఇప్పడు హాట్ కేంద్రం. హైదరాబాద్‌కు 90 కిలోమీటర్లు ఉండడంతో పాటు ఇక్కడ నుంచే మరో కర్నాటకకు వెళ్లే చించోలి జాతీయ రహదారి కూడా ఇటీవల మంజూరైంది. అంతేకాదండోయ్ భారత్ మాల అంటూ మరో అవు టర్ రింగ్ రోడ్ కూడా ఈ మున్సిపాల్టీ నుంచే వెళ్లుతోంది. ఇక ఈ మున్సిపాల్టీ మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) పరిధిలోకి వస్తుం ది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంకు కూడా కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో భూత్పూర్ అంటేనే ఇప్పడు కోట్లు విలువ చేసే భూములకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే భూత్పూర్ రూరల్ ప్రాంతాల్లో కోట్లలో విలువచేసే ప్రభుత్వ భూములు, అసైన్డ్, భూధాన్ భూము లు, వక్ఫ్ బోర్డు భూములున్నాయి. ఇక్కడి భూములు ఇప్పుడు బంగారం కంటే పది రెట్లు విలువైనవిగా భావిస్తున్నారు.

దీంతో ఇక్కడి ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూముల కబ్జాలకు రాజకీయ నేతలు పక్కా ప్లాన్లు వేశారు.అందులో బాగంగానే వారి కన్ను భూదాన్ భూములపై పడింది. భూత్పూర్ శివారులో ఉన్న బి శేర్‌పల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 173,174,175,176,177 లలో దాదాపు 30 ఎకరాల భూ-మి ఉంది. ఇది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు చెం దిన భూమిలేని వారికి పంపిణీ చేసిన భూమి. అయితే ఈ భూమిపై భూత్పూర్ కేంద్రంగా ఉన్న అధికార నేత, ప్రతిపక్ష నేతలు కలిసి ఈ భూములపై కన్నే శారు. ఇంకేముందు స్దానిక రెవెన్యూ అధికారుల నుంచి నాలా కన్వర్షన్ తీసుకున్నారు. వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చుకున్నారు. అంతేకాదండోయ్ దాని పక్కనే సర్వే నెంబర్ 221 లో ఉన్న 15 ఎకరాలను కూడా కబ్జా చేశారు. ఈ భూమిపై అప్పట్లో ఫిర్యాదులు రావడంతో అప్పటి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఈ భూమిపై క్షేత్ర స్దాయిలో వెళ్లి విచారించి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు వేసి వెళ్లారు. కాని ఇప్పడు ఆయన లేక పోవడంతో ఈ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణలు ఉన్నాయి.

మొత్తం పెద్ద ఎత్తున ప్రభుత్వ, భూదాన్ బూముల్లో అక్రమ వెంచర్ వేసుకొని దర్జాగా ప్లాట్ల విక్రయాలు జరుపుకుం టున్నారు. అడిగే నాథుడే లేక పోవడం కొసమెరుపు. ఈ భూమిపై సవాలక్ష ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములను ఎట్టి పరి స్థితుల్లోనూ ప్రభుత్వ అవసరాలకు మినహా ఇతర ప్రవేట్ వ్యక్తులకు విక్ర యిం చ రాదు. బదలాయింపు జరగకూడదు. భూధాన్ భూములపై, కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఇది ప్రభుత్వ భూమి అన్ని చెప్ప బోర్డు పాతినప్పటికీ ఆ భూము లకు తిరిగి ఎవరు అనుమతి ఇచ్చారు? రెవెన్యూ అధికారులా? అపై అధికా రులా, ఇచ్చి ఉంటే ఏ చట్టప్రకారం ఇచ్చారు? అసలు ఈ భూములకు ఎన్‌ఒసి ఎలా వచ్చింది. ఇందులో ఎన్ని లక్షలు చేతులు మారి ఉంటాయన్న పలు అనుమా నాలు కల్గుతున్నాయి. అసలు ఈ వెంచర్‌కు డిటిసిపి అనుమతులున్నాయా? చట్టం ఒకిరికి ఒకరిలా ఉండదు కదా? మరి ఇక్కడ చట్టం వారికి చుట్టంగా ఎలా మారింది అన్న సందేహాలు ప్రజలనుంచి వ్యక్తం అవుతు న్నాయి.

భూదాన్ చట్టం ఏమి చెబుతోంది.?

అసలు భూధాన్ భూమి చట్టం ఏమి చెబుతుందో చూద్దాం. 1951 మహాత్మా గాంధీ స్పూర్తి ఉద్యమంతో ఆచార్య వినోభాభావే నిజాంబాద్ జిల్లా పోచం పల్లిలో భూములు అధికంగా ఉన్న వారు భూమి లేని పేదలు, కౌలుకు చేసు కునే రైతుల కోసం భూములు దానం చేయాలని కోరారు. గాందీ, వినోభా బావే స్పూర్తితో అనేక మంది దొరలు, భూస్వాములు స్వచ్చందంగా ముందు కు వచ్చి భూదానం చేశారు. అందుకే వాటికి భూధాన్ భూములు అని పేరు వచ్చింది. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో 1965లో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పరిధిలో దానం చేసిన భూములపై సమగ్ర చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం భూధాన్ భూములను పంపిణీ చేసిన ఎస్సి,ఎస్టి,బిసి రైతులు వారు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలని, ఇతరుకు విక్రయించుకోవడం కాని, ఇతరుల కు బదాలయించడం కాని చేయరాదు.

ఒక వేళ తమ తదానంతరం తమ వారసులు మాత్రమే ఈ భూమిని అనుభవించుకోవచ్చు తప్ప ఎలాంటి క్రయ విక్రయాలు జరపరాదు అని ఉంది. ఈ భూములన్ని భూధాన్ బోర్డు పరిధి లోకి చేర్చింది. ఇలా 13 వేల మంది బడా రైతులు సుమారు 2 లక్షల 90 వేల ఎకరాలను 1.60 వేల మంది భూమి లేని రైతులకు పంపిణీ చేశారు. అయితే ఈ భూములపై అనేక ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ 2014 తర్వాత జిఒ నెంబర్ 59, 60 ద్వారా భూధాన్ బోర్డును రద్దు చేశారు. ప్రభు త్వ పరిధిలో ఉండేలా చేశారు. భూధాన్ పట్టాలున్న రైతులు ఎంఆర్‌ఓ దగ్గరకు వెళ్లి చూపించి వారివద్ద ఆర్‌ఒఆర్, వన్‌బి,లో ఎక్కించుకొని పట్టాదార్ పాసు బుక్కులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అనేక మంది చేయించు కున్నారు. అయితే ఇదే చట్టాన్ని కొందరు తూట్లు పొడిచారు. అయినప్పటికీ పాత రికార్డుల ప్రకారం వీటిని అమ్మకూడదు, కొనకూడదు అని ఉంది. ఒక వేళ ఎవరూ లేకపోతే అది ప్రభుత్వభూమిగా పరిగణించ బడుతుంది. అంతే తప్ప ఇతరులకు విక్రయాలు జరపకూడదు.

మరి అక్రమణ పర్వం ఎలా సాగింది ?

చట్టం ఇలా చెబుతుంటే బి. శేర్‌పల్లి గ్రామంలో ఉన్న భూదాన్ భూముల వెను క ఉన్న అదృశ్య శక్తులు రెవెన్యూ అధికారులను లోబర్చుకొని వంద కోట్లు విలువ చేసే భూధాన్ భూములకు ఎసరు పెట్టారు. చట్టాలను దుర్వినియోగం చేసి వ్యవసాయ పొలాలుగా ఉన్న వాటికి నాల కన్వర్షన్ ఎలా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ భూములకు ఎన్‌ఓసి చక చకా జరిగిపోయాయి. ఇవన్నీ ఎలా ఉన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మక ధరణి పోర్టల్ ప్రవేశపెట్టింది. ఇందులో భూదాన్ భూములని ఉన్నా వాటికి ఎన్‌ఒసి ఎలా వచ్చిందన్నది సవాలక్ష అనుమా నాలకు తావిస్తోంది.

నకిలీ రిజిష్టర్ డాక్యమెంట్లును తయారు చేసి ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూత్పూర్ కేంద్రంలో ఉన్న ప్రధాన అధికార పార్టీ నాయకుడు ఒకరు, ప్రతి పక్ష పార్టీకి చెందిన మరొకరు నేతు ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ భూములపై గద్దల్లా వాలి అక్రమణకు దిగారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వెంచర్ జరుగుతున్నా మున్సి పల్ అధికారులకు ఆపే దమ్ములు లేక పోవడం విడ్దూరం. పోనీ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఈ భూములకు కూత వేటు దూరంలోనే ఉంది. పోనీ జిల్లా రెవెన్యూ ఉన్నతాదికారులైనా ఆపే దమ్ము చేస్తారా లేదా చూద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News