భోపాల్: తనకు సంతానం కలగడానికి జైలులో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని ఓ మహిళ జైలు అధికారులను అభ్యర్థించడం చర్చనీయాంశం అయింది. గ్వాలియర్ లోని శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారాసింగ్ జాతవ్ కు ఏడేళ్ల క్రితం పెళ్లయింది. అయితే, కొద్ది రోజులకే ఓ హత్య కేసులో దారాసింగ్ జైలుపాలయ్యాడు. అప్పటినుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవల దారా భార్య తనకు పిల్లలు కావాలని, అందువల్ల తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని జైలు అధికారులను అభ్యర్థించింది.
ఈ దరఖాస్తును శివ్‌పురి ఎస్పీకి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పంపారు. మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం జీవితఖైదు పడిన దోషి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుంటే సత్ప్రవర్తన కారణంగా పెరోల్ పొందే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం జిల్లా కలెక్టర్‌దే. ఇలాంటి సంఘటన గతంలో రాజస్జాన్‌లో జరిగింది. సంతానం పొందడం తన హక్కని, అందువల్ల జైలులో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని ఓ మహిళ పిటిషన్ దాఖలు చేయగ, జోథ్‌పూర్ ధర్మాసనం 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.