Monday, December 23, 2024

మల్లారెడ్డిపై భూకబ్జా కేసు

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి, ఆయన అనుచరులపై ఎస్‌సి, ఎస్‌టి కేసు నమోదు
శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు
గిరిజనుల రిజిస్ట్రేషన్
చేయలేదు : తహసీల్దార్ వాణిరెడ్డి

మన తెలంగాణ/శామీర్‌పేట : మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట్ పోలీసు స్టేషన్ సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో భూమిని రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్‌టి (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్) జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా బాధితుడు కేతావత్ బిక్షపతి నాయక్ మాట్లాడుతూ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల18 గుంటల భూమి మా పెద్దల నుండి మాకు వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు. మా కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరు మీద మొత్తం భూమి ఉందన్నారు. ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులతో కలిసి మాకు మాయ మాటలు చెప్పి నమ్మించి మా ఏడుగురితో 250 కోట్ల విలువ చేసే భూమిని పిటి సరెండర్ చేయించారని పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి ఎస్‌టి లంబాడీలమైన మాపై అట్రాసిటీ పాల్పడినారని, మా ఏడుగురుకి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చి భూమి తీసుకున్నారని వెల్లడించారు.

రిజిస్ట్రేషన్ చేయలేదు : తహసీల్దార్ వాణిరెడ్డి

మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌లు 33,34,35లలో 40 ఎకరాల భూమిలో పిటి దారుల వారసులమని గిరిజనులు పది మంది హైకోర్టు ఉత్తర్వులతో దరఖాస్తు చేసుకున్నారు. వారికి నోటీసులు ఇచ్చి పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నాను తప్ప ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదని తహసీల్దార్ వాణిరెడ్డి తెలిపారు. ఈ సర్వే నెంబర్లలో గత 2019లో 7 ఎకరాల 18 గుంటల భూమిని పిటి సరెండర్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారని వెల్లడించారు. అందులో 40 ఎకరాల భూమి 2021లోనే పట్టాదారుల నుంచి సిఎంఆర్ ఇన్‌ఫ్రా పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News