జమ్మూ: జమ్మూలో టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇఓ జవహర్ రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ నేత రాం మాధవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజ్ ప్రాతిపదికన మజీన్ ప్రాంతంలో 62 ఎకరాల భూమిని జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. రూ.33.22 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి కానుంది. దేవాలయ ప్రాజెక్టులో భాగంగా వేదపాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. జమ్మూ, కశ్మీర్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు టిటిడి బోర్డుకు, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా లెఫ్టెనెంట్ గవర్నర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ నిర్మాణంతో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు.