Tuesday, April 1, 2025

 వసుధైక కుటుంబానికి ప్రతీక భూటాన్

- Advertisement -
- Advertisement -

అది భూటాన్ దేశం. పర్వతాలు, కొండలతో కూడిన సుందర మైన దేశం. లోతైన లోయలు, ఆకాశాన్ని తాకే పైస్ వృక్షాలు, స్వచ్ఛందంగా ప్రవహించే నదీనదాలు, రంగురంగుల పూలు, రకరకాల పక్షులు. అంతకన్నా మౌనంగా పలకరించే మనసు కలిగిన మనుషులు, ఇంకా ఎన్నో విశేషాలు ఆ దేశం నిండా మనకు కనపడతాయి. వినపడతాయి. ఆ దేశంలో మానవతా విలువలు ప్రతి ప్రదేశంలో, ప్రతి మదిలో దర్శనమిస్తాయి. అటువంటి ప్రదేశమే భూటాన్ రాజధాని థింపూ నగరంలో ఉన్న కింగ్ మెమోరియల్. అది ఆ దేశంలోని మత సాంప్రదాయాలకు నెలవు. అది భూటాన్ మూడో రాజు జిగ్నేదొర్జి వాంగ్ చుక్ స్మారకార్ధం ఆయన తల్లి పుంట్సో చోడన్ నిర్మించిన కట్టడం.

దీనిని టిబెటన్ ఆర్కిటెక్చర్ సాంప్రదాయంలో నిర్మించారు. దీని నిర్మాణ కౌశలం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీటన్నిటి కన్నా మించి, ఈ ప్రదేశానికి మరొక ప్రత్యేకత ఉన్నది. ఇది మానవత కొలువుండే పవిత్ర ప్రదేశం. దీనిని నేను మొదటి సారిగా చూసినపుడు మతం, ఇతర సాంప్రదాయాలు మాత్రమే అర్ధమయ్యాయి. కానీ అంతకన్నా మించి ఒక అద్భుతమైన మానవీయ ప్రదేశం అని తెలిసి ఇటువంటి ప్రదేశం మరెక్కడా నేను చూడకపోవడం ఆశ్చర్యంగా కనిపించింది.

ఇక్కడ వందల మంది వృద్ధులు, ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు కనిపిస్తారు. దీనిని చూస్తే మనం అనాధలు అందరూ ఇక్కడ ఉంటారేమో అనే భ్రమ కలుగుతుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యటకులు ఇచ్చే దానాల కోసం ఇక్కడ ఉండే బిచ్చగాళ్లమో అనుకునే ప్రమాదమంది. ఈ దేశంలో బిచ్చగాళ్ళు అనే పదం లేదని తెలిసిన తర్వాత దీని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం పెరిగింది.
ఇది మూడవ రాజు స్మారకార్ధం ఏర్పడిన కట్టడం. అయితే ఇది ఒక విశేషమై కలయికకు కేంద్రమైంది. ఇక్కడ చేరుతున్న వృద్థులు, ఇతర పెద్దలు దిక్కులేని అనాధలు కాదు. అందరూ చాలా సంతోషంగా కుటుంబాలతో ఉంటున్న వాళ్ళు. కుటుంబంలోని వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళ కార్యాలయాలకు, దుకాణాలకు ఇతర పనులకు వెళుతూ ఇక్కడ వదిలి వెళుతుంటారు.

దాదాపు అందరూ అటువంటే వాళ్ళే. పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళుతుంటారు కదా. అందువల్ల వృద్ధులు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ వయసులో ఒంటరిగా ఉండడం మంచిదికాదని, ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే సహాయం కష్టం అవుతుందని భావించినట్టు ఉన్నారు. దీనితో నగర అధికారులు, పౌరులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దలను, వృద్దులను ఇక్కడ వెళుతుంటారు. ఇప్పుడు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా, అందరు వృద్ధులు, పెద్దలు ఒక కుటుంబమైపోయారు. ఇంటి నుంచి వచ్చెటప్పుడు అందరూ తమ తమ తిండిని తెచ్చుకుంటారు. గుంపులుగా కలిసి సామూహిక భోజనాలు చేస్తుంటారు. మేము ఈ కేంద్రం సందర్శించినప్పుడు ఐదారుగురు కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ 60పై బడిన వారే. అయితే అందులో ఒకరు 30 ఏళ్ళ వయస్సు ఉన్న యువతి కూడా ఉంది. ఆమెను పలకరించినప్పుడు “మా నాయనమ్మను తీసుకొచ్చాను. మిగతా పెద్దలైన మహిళలతో మాట్లాడానిపించి వచ్చాను.

మా నాయనమ్మకు ఈ కేంద్రం ప్రవిత్ర దేవాలయం. ఇక్కడ వాళ్ళందరు కలిసి మెలిసి ఉంటుంటే, వాళ్ళు తమ వృద్ధాప్యాన్ని మరిచి పోతుంటారు “అంటూ సమాధానమిచ్చింది.” ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఏర్పడితే, అది తగ్గేదాకా రావడం కష్టం. అప్పుడు వాళ్ళు తెగ బాధ పడిపోతుంటారు. ఇక్కడికి వచ్చిన తమ శారీరక బాధలన్ని మరిచిపోతారు అని తన సమాధానాన్ని పొడిగించింది. ఇక్కడ మహిళలే కాదు. మగవాళ్ళు కూడా ఉన్నారు. ఒకాయన రిటైర్డ్ హెడ్‌మాస్టర్. ఆయన పిల్లలు అందరూ మంచి ఉద్యోగాలలో ఉన్నారు. అయినా ఆయనకు ఇదే సాంత్వన చేకూర్చే కేంద్రం. సేద తీరే సౌథం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెపుతుంటే ఎంతో సంతోషమనిపించింది.

ఇక్కడ మరొక విషయం మననం చేసుకొవాలి. ఈ పార్క్‌లో ప్రభు త్వం తరపున కొం తమంది ఉద్యోగస్తు లు ఉంటారు. వీళ్ళందరి మీద ఒక కేర్‌టేక ర్ ఉంటారు. ఎవరికైనా అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే అందరూ ఒక దగ్గర చేరి ఉపశమన చర్యలు చేస్తారు. ఒకవేళ తక్ష ణం ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సివస్తే అందుబాటులో అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది. అక్కడ నలుగురైదుగురు ఒక కుటుంబం కాదు.. వందల మంది ఒకే కుటుంబం. అక్కడ నిజంగా వసుధైక కుటుంబానికి అసలు అర్థం కనిపించింది.

భూటాన్ దేశానికి చాలా దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అన్ని సుందర ప్రదేశాలను చూడడం ఒక ఎత్తైతే, కింగ్ మెమోరియల్ పార్క్‌ను చూడడం మరోఎత్తు. ఇక్కడ ఎతైన కొండలు, లోతైన లోయలు మాత్రమే కాదు, అంతకన్న విశాలమైన హృదయాలు కనిపిస్తాయి. ఆ గుండెల సవ్వడి వినిపిస్తుంది. ఇటువంటి అరుదైన సాంప్రదాయం కలిగిన భూటాన్ ఒక బౌద్ద దేశం. నూటికి 90 మంది బౌద్దాన్ని తమ ఆచరణ సాంప్రదాయంగా భావిస్తారు. గౌతమి బుద్దుని బోధనలు, గురు రింపో చే పద్మ సంభవ మార్గదర్శనం వారిని ఎల్లప్పుడు మంచి మనసులు కలిగిన గొప్ప మనుషులుగా నిలబెడుతున్నాయి. బౌద్ధంలో అన్ని విషయాలతో పాటు పిల్లలు, మహిళల, వృద్ధులు, గురువులకు ఒక ప్రత్యేక స్థాన మున్నది.
గౌతమ బుద్ధుడు జీవించిన కాలంలో మగధ రాజు ఆజాత శత్రువు తన సమీపంలోని వైశాలిని ఆక్రమించుకోవడానికి పధకాలు రచించాడు. అయితే దీని విషయమై గౌతమ బుద్ధుని అభిప్రాయం తెలుసుకోవడానకి తన మంత్రి వస్సకారను పంపిచాడు.

అప్పుడు గౌతమి బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో ఈ విషయం సంభాషించాడు. అందులో వైశాలి జనపదం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాల ఆచరణతో పాటు, వృద్ధులు, మహిళలు, పిల్లలు, గురువులను వైశాలి జనపదం గౌరవంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్న విషయాన్ని వస్సకారకువివరించారు. అటువంటి ప్రజాస్వా మ్య విధానాలు, వృద్ధులను, మహిళలను, పిల్లలను, గురువులను తమ హృదయాలలో దాచుకుంటున్న సమాజాన్ని, రాజ్యాన్ని ఎవరూ జయించలేరని గౌతమ బుద్దుడు ప్రకటించారు. బౌద్ధంలో ఇటువంటి తాత్విక భావనలు ఉండడం వల్లే భూటాన్ దేశం ప్రత్యేక ఆలోచనలను కలిగి ఉన్నది.

భూటాన్ దేశం జనాభా దాదాపు ఎనిబది లక్షలు మాత్రమే. అటువంటి అతి చిన్న దేశం ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్లు జనాభా కలిగిన ప్రపంచానికి మార్గ నిర్ధేశం చేసింది. భూటన్ దేశం ప్రతిపాదించిన ఒక ఆర్థిక సూత్రీకరణ ప్రపంచ మేధావులను అబ్బురపరిచింది. అంతే కాకుండా, భూటాన్ దేశ ఆలోచనలను అనుసరించే టట్టు ప్రపంచాన్ని ఒప్పించింది. 1972లో అప్పటి భూటన్ రాజు జిగ్మే వాంగ్ చుక్ దీనిని రూపొందించారు. పైన పేర్కొన్న పేరు కూడా ఆయన స్మారకార్ధం పెట్టినదే. జిగ్మే వాంగ్ చుక్ ప్రతి పాదించిన సూత్రం హ్యాపినెస్ ఇండెక్స్. అప్పటివరకు దేశ అభివృద్ధిని కేవలం దేశ జాతీయోత్పత్తి ప్రాతిపదికగా నిర్ణయించే వాళ్ళు. ఇది యూరప్ దేశాల ప్రతిపాదన . అదే అందరికి మార్గదర్శకమైంది. కానీ 1972లో జిగ్మే వాంగ్ చుక్ నేను ప్రతిపాదిస్తున్న ఈ స్థూల జాతీయ సంతోష సూచిక (Gross national Happiness Sensex) ను ఎవరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. కానీ నావరకు ఇది విలువలతో కూడిన అభివృది.్ధ మానవత్వం, సమానత్వం, కరుణలతో కూడిన ప్రాధమిక విలువలకూ, అవసరమైన ఆర్థిక ప్రగతికీ మధ్య వారధిని నిర్మించడమే దీని ప్రధాన ఉద్దేశం.” అని వాంగ్ చుక్ చేసిన వ్యాఖ్య బౌద్ధం మౌలిక చెంతనకు అద్దం పడుతోంది.

అయితే ఇది ప్రపంచ వ్యాప్తం కావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ముందుగా భూటాన్ తమ దేశంలో దీనిని ప్రయోగాత్మకంగా అనుసరించింది. మానవాళివృద్ధికి 33 సూచికలను రూపొందించింది. ఈ విషయం చాలా మంది ఆర్థికవేత్తలను, రాజనీతి నిపుణులను, విధాన నిర్ణేతలను ఆలోచింపజేసింది. మొదటిసారిగా 2005 సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ హ్యపినెస్ ఇండెక్స్ ఆధారంగా సర్వే చేపట్టింది. 2005 సంవత్సరంలో దీని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. 2007 సంవత్సరంలో ధాయిలాండ్ ప్రభుత్వం గ్రీన్ అండ్ హ్యాపినెస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. 2009 సంవత్సరంలో అమెరికా కూడా వెల్ బియింగ్ ఇండెక్స్‌” పేరుతో సర్వే చేసింది. 2010 సంవత్సరంలో కర్మ నేతృత్వంలో భూటాన్ ప్రభుత్వం భూటాన్ అధ్యయక సంస్థను నెలకొల్పి, ప్రత్యేక మైన సూచికలను రూపొందించింది. అంతిమంగా 2011 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అంగీకరించి 2013 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం హ్యాపినెస్ ఇండెక్స్ పేరుతో ఒక నివేదికను విడుదల చేస్తున్నది. ఇది ఒక ప్రత్యామ్నాయ మానవాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అటువంటి మానవాభివృద్ధి నమూనాను అందించిన భూటాన్‌ను అభినందించకుండా ఉండలేం.

మల్లెపల్లి లక్ష్మయ్య దర్పణం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News