మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు భద్రతపై ఆందోళన ఉందని, ఆయనకు సౌకర్యాలు లేవు. కనీసం స్నానానికి వేడి నీళ్ళు కూడా లేవని వాటిని కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు నాయుడు సతీమని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ములాఖత్‌లో చంద్రబాబునాయుడనికి కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ ..ఈ రాష్ట్రం కోసం నిరంతరం తపించిన వ్యక్తి చంద్రబాబు అని రాష్ట్రం గురించి తప్ప కుటుంబం గురించి ఆలోచించకుండా పేదవారి కోసం పనిచేసిన నాయకుడన్నారు.ఏపీని జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు రాత్రింబవళ్లు పనిచేసిన దార్శనికుడు.
ఇలాంటి వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం కక్షగట్టి అక్రమ కేసులో ఇరికించి జైలులో నిర్బంధించిందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు కట్టిన జైలు బిల్డింగులోనే ఆయన్ను నిర్బంధించడాన్ని మా కుటుంబం జీర్ణించుకోలేకపోతోందన్నారు. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించారని, పేద, బడుగు, బలహీనవర్గాల వారి సంక్షేమం ధ్యేయంగా పెట్టిన టీడీపీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అండగానే నిలబడుతుంది…నిలబెడతాం… మేమూ నిలబడతామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేము ఏనాడూ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి గాని, సచివాలయానికి గాని వెళ్లలేదు. నేడు ఆయన్ను చూడడానికి జైలుకు వెళ్లడం అత్యంత బాధాకరమైన విషయం. చంద్రబాబుని చూసి బయటకు వస్తుంటే ఏదో కోల్పోయిన్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.