Thursday, December 26, 2024

భువీ, చాహర్‌లకు జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

రహానె, పృథ్వీషా, మయాంక్‌లకు నిరాశ
ఆసక్తికరంగా సాగిన ఐపిఎల్ వేలం పాట

జెడ్డా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాట ఆసక్తికరంగా సాగుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా ఈ వేలం పాట జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం రెండో రోజు కూడా పలువురు ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడు పోయారు. వీరిలో భారత ఫాస్ట్ బౌలర్లు అధికంగా ఉండడం విశేషం. టీమిండియా వెటరన్ స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. రెండు కోట్ల రూపాయల కనీస ధరతో బరిలోకి దిగిన భువనేశ్వర్‌ను చివరికి బెంగళూరు రూ.10.75 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం.

భువీ కోసం ముంబై, లక్నోలు ఆరంభంలో గట్టిగా ప్రయత్నించాయి. కానీ అనూహ్యంగా రంగంలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మొత్తం చెల్లించి భువీని దక్కించుకుంది. మరో భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని రూ.9.25 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిది. ముకేశ్ కుమార్ కోసం కూడా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి రూ.8 కోట్లకు ఢిల్లీ ఆర్‌టిఎమ్ కార్డు ఉపయోగించి ముకేశ్‌ను దక్కించుకుంది. ఆకాశ్‌దీప్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని లక్నో రూ.8 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. భారత్‌కు చెందిన మరో స్పీడ్‌స్టర్ తుషార్ పాండేను రూ.6.50 కోట్లకు రాజస్థాన్ సొతం చేసుకుంది.

అతను కోటి రూపాయల కనీస ధరతో బరిలోకి దిగాడు. కాగా, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్సొ యాన్సెస్‌ను పంజాబ్ కింగ్స్ రూ.7 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. కృనాల్ పాండ్యను రూ.5.75 కోట్లను వెచ్చించి బెంగళూరు దక్కించుకుంది. అఫ్గాన్ సంచలన స్పిన్నర్ గజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 4.80 కోట్లను వెచ్చించి సొంతం చేసుకోవడం విశేషం. గజన్‌ఫర్ రూ.75 లక్షల కనీస ధరతో వేలంలో నిలిచాడు. భారత ఆటగాడు నితీశ్ రాణాను ముంబై ఇండియన్స్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది. భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను గుజరాత్ రూ.3.20 వెచ్చించి సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు వేలంలో పలువురు భారత క్రికెటర్లకు నిరాశే మిగిలింది. అజింక్య రహానె, పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్ తదితరులు కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News