Tuesday, December 24, 2024

బిభవ్ కుమార్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపి స్వాతి మాలివాల్‌పై దౌర్జన్యం ఆరోపణ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సహాయకుడు, మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బిభవ్ కుమార్‌ను ముఖ్యమంత్రి నివాసం వెనుక గేటులో నుంచి బయటకు తీసుకువెళ్లారు. స్వాతి మాలివాల్ ఫిర్యాదు దృష్టా కుమార్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాను ఈ నెల 13న సిఎం నివాసానికి వెళ్లినప్పుడు బిభవ్ కుమార్ తనను ఏడెనిమిది సార్లు చెంపదెబ్బ కొట్టారని, తన ఛాతీలో, పొత్తి కడుపులో పదే పదే తన్నారని మాలివాల్ ఆరోపించారు. తాను రుతుక్రమంలో ఉన్నట్లు చెప్పిన తరువాత కూడా బిభవ్ దారుణ దాడిని ఆపలేదని మాలివాల్ ఆరోపించారు. ఆ దాడి తరువాత తన చేతులు నొప్పి పెట్టాయని, తనకు నడవడం కష్టమైందని ఆమె తెలిపారు.

ఆ నేర ఘటన పునఃసృష్టి కోసం మాలివాల్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేజ్రీవాల్ నివాసానికి తీసుకువెళ్లారు. తీస్ హజారి కోర్టులో మేజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాఙ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా, బిభవ్ కుమార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఎదురు ఫిర్యాదు దాఖలు చేశారు. మాలివాల్ ‘బలవంతంగా, అనధికారికంగా’ ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించినట్లు బిభవ్ ఆరోపించారు. ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ తనపై ‘దౌర్జన్యానికి, రభస సృష్టికి’ ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. రాజ్యసభ ఎంపి ఆప్ చీఫ్‌కు హాని కలిగించాలని అనుకున్నారని, తాను తీవ్రంగా“వ్యతిరేకించాను’ అని కూడా బిభవ్ తెలిపారు. మరొక వైపు ఢిల్లీ మంత్రి ఆతిషి విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రచారానికి మద్యం పాలసీ కేసులో ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరైన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ‘కుట్రలో’ భాగం అయ్యేందుకు మాలివాల్‌ను బిజెపి ‘బ్లాక్‌మెయిల్ చేసింది’ అని ఆరోపించారు. మాలివాల్ సిఎం నివాసంలో సెక్యూరిటీ గార్డులతో వాదిస్తున్నట్లు సూచిస్తున్న ఈ నెల 13 నాటి వీడియోను ఆప్ శుక్రవారం విడుదల చేసింది.

పోలీస్ చర్య గు రించి మాలివాల్ గార్డులను బెదరిస్తుండడం, ధైర్యం ఉంటే తనను గెంటివేయాలనడం ఆ వీడియోలో వినవచ్చింది. ఆప్ ఎంపిని భద్రత సిబ్బంది ఢిల్లీ సిఎం నివాసంలో నుంచి బయటకు తీసుకువెళ్లడం మరొక వీడియోలో కనిపించింది. మాలివాల్ నాటకం ఆడుతోందని ఆప్ ఆరోపించింది. ఆమె కుంటుకుంటూ కాకుండా మామూలుగా నడుస్తుండడం వీడియోలో కనిపించిందని ఆప్ తెలిపింది.‘ఆమె దుస్తులు చినిగిపోలేదని, ఆమె నొప్పితో బాధపడడం లేదని వీడియోలో చూడవచ్చు. ఎఫ్‌ఐఆర్‌లో రాసింది అంతా తప్పు అని వీడియో సూచిస్తోంది. ఆమె బిభవ్ కుమార్‌ను దూషించారు& ఆమె తేలికగా నడచి బయటకు వెళుతుండడాన్ని సిఎం నివాసం ద్వారం సిసిటివి ఫుటేజ్ సూచిస్తోంది’ అని ఆతిషి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News