జనగాం: ప్రేమ వివాహం చేసుకున్న ప్రేమజంటను అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు విడదీయడంతో భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని వరప్రసాద్ (24) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరిని పిఎస్‌కు తరలించారు. పది రోజుల తరువాత ఇద్దరికి అందరి సమక్షంలో పెళ్లి చేస్తామని అమ్మాయి కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో వరప్రసాద్ సరేనన్నాడు.
పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఒప్పంద పత్రాలు రాసుకొని వెళ్లిపోయారు. పది రోజుల తరువాత అమ్మాయి మనసు మార్చుకొని ఎవరి దారిన వారు చూసుకుందామని చెప్పడంతో ప్రసాద్ మనస్తాపం చెందాడు. మార్చి 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం దుర్మరణం చెందాడు. ప్రసాద్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరప్రసాద్ ఆత్మహత్యకు ఎస్‌ఐ కారణమని మృతుడి బంధువుల, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించారు. మండల కేంద్రంలో ఎస్‌ఐ సాయి కుమార్ ప్రేమజంటను విడదీశారని పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. వరప్రసాద్ పెళ్లి చేసుకున్న ఫోటోలు పొస్టర్లలో ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎస్‌ఐ బెదిరించి అమ్మాయి తరపున మాట్లాడడని ప్రసాద్ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.