జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్ తొలి చిత్రాన్ని విడుదల చేసిన జోబైడెన్
వాషింగ్టన్ : జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన మొట్టమొదటి చిత్రం విడుదల అయింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఈ ఫొటోలను సోమవారం ఆవిష్కరించారు. వైట్‌హౌస్‌లో జరిగిన ప్రివ్యూ ఈవెంట్‌లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సమక్షంలో ఈ మొదటి చిత్రం విడుదల చేశారు. అంతరిక్షానికి సంబంధించి ఇప్పటివరకు మానవాళి చూడని, 13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రాన్ని ఈ టెలిస్కోప్ ఆవిష్కరించింది. నేడు చారిత్రకమైన రోజు…అమెరికాకు , మానవాళికి గుర్తుండిపోయే ఘట్టం అని జోబైడెన్ అభివర్ణించారు. ఈ చిత్రంలో నీలం, నారింజ, తెలుపు రంగుల్లో గల వేలాది గేలాక్సీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వివరించారు. ఈ చిత్రంలో మనం చూస్తున్న కాంతి 13 బిలియన్ సంవత్సరాలుగా ప్రయాణిస్తోందని, ఇది బిగ్ బ్యాంగ్ కంటే కేవలం 800 మిలియన్ సంవత్సరాల చిన్నదని నెల్సన్ వివరించారు. ఇది మనందరికీ చాలా ఉత్తేజకరమైన క్షణం. విశ్వంలో కొత్త అధ్యాయానికి ఈరోజు నాంది అని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కొనియాడారు.
విశ్వ రహస్యాలను ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు 10 బిలియన్ డాలర్ల వ్యయంతో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్లుఎస్‌టీ)ను రూపొందించాయి. 2021 డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. భూమికి 1.6 మిలియన్ కిలో మీటర్ల దూరంలో దీని వీక్షణ స్థానంలో ఇది 2022 జనవరిలో చేరుకుంది. ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో దీన్ని ప్రవేశ పెట్టారు. విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి అనేక అంశాలను ఈ టెలిస్కోప్‌తో కనుగొననున్నారు. పదేళ్ల పాటు దీని కార్యకలాపాలు కొనసాగుతాయని అంచనా వేసినా , ఇందులో ఇరవై ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేయడానికి కావలసిన ఇంధన సామర్ధం ఉందని నాసా వెల్లడించింది. విశ్వం లోనే అతిభారీ టెలిస్కోప్‌గా రికార్డు సృష్టించిన ఈ టెలిస్కోప్ సైన్స్ కార్యకలాపాల అధికారిక ప్రారంభాన్ని ఈ తొలిచిత్రం విడుదల సూచిస్తోంది. దీని మిషన్‌లో భాగంగా కీలకమైన అన్వేషణలను కొనసాగిస్తోందని నాసా పేర్కొంది. జేమ్స్ వెబ్ సాధించాల్సిన తొలి ఐదు లక్షాలను నాసా శుక్రవారం వెల్లడించింది.