వాషింగ్టన్ : భారతీయుల దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రజలకు శుభాకాంక్షల సందేశాలు వెలువరించారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని నిర్వహించుకునే వారందరికీ గ్రీటింగ్స్ అంటూ వీరు వేర్వేరుగా తమ అభినందనలు తెలిపారు. ఇది కాంతుల సంబరాల పండుగ. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి దశలో ఇది చీకట్లను తొలిగించే సంకేతాల పరమార్థాన్ని సంతరించుకుని నిర్వహించుకునే పండుగ అని తెలిపారు. చీకట్లను తొలిగించుకుని జ్ఞాన, నిత్యసత్యాల కాంతులను అందుకునే ఆశాభావాన్ని సంతరించుకునే వేడుక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బైడెన్ వైట్‌హౌస్ ఆవరణలో దేశ ప్రధమ పౌరురాలు , సతీమణి జిల్ బైడెన్‌తో కలిసి మట్టి ప్రమిదను వెలిగించినప్పటి ఉత్సాహభరిత ఫోటోను పొందుపర్చారు. అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలో ఉన్న వారందరికీ తన సాదర ఆనంద అభినందనం అని భారతీయ సంతతికి చెందిన వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఓ వీడియో సందేశం వెలువరించారు.