Wednesday, November 13, 2024

ట్రంప్‌కు బైడెన్ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

13న వైట్ హౌస్‌లో భేటీ
అధ్యక్షుని మార్పు ప్రక్రియకు లాంఛనంగా శ్రీకారం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడుగా పదవీ విరమణ చేయనున్న జో బైడెన్ తన వారసుడు, అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను ఈ నెల 13న (బుధవారం) వైట్ హౌస్‌లో సమావేశం కోసం ఆహ్వానించారు. దానితో అధ్యక్షుని మార్పిడి ప్రక్రియ లాంఛనంగా మొదలవుతుంది. ‘అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానంపై అఢ్యక్షుడు బైడెన్, అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ ఆఫీస్‌లో భేటీ అవుతారు’ అని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరీన్ జీన్ పియర్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు, రానున్న అధ్యక్షుడు సమావేశం కావడం లాంఛనపూర్వకం. దశాబ్దాల నాటి సంప్రదాయానికి చిహ్నం.

ఈ భేటీ సాధారణంగా ఓవల్ ఆఫీస్‌లో జరుగుతుంది. పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు దేశం ప్రధాన అజెండా గురించి అధ్యక్షునిగా ఎన్నికైన నేతకు వివరిస్తారు. అధ్యక్షునిగా ఎన్నికైన నేతకు వైట్ హౌస్ అంతటా తిప్పి చూపుతారు. అదే సమయంలో ప్రథమ మహిళ, కాబోయే ప్రథమ మహిళ మధ్య సమావేశం కూడా జరుగుతుంది. ఒక అధ్యక్షుడు నాలుగు సంవత్సరాల విరామం తరువాత తిరిగి ఎన్నిక కావడం అమెరికా చరిత్రలో ఇది రెండవ పర్యాయం. ఈ కేసులో అధ్యక్షునిగా ఎన్నికైన, 2017 జనవరి 20 నుంచి నాలుగు సంవత్సరాల పాటు అమెరికా 45వ అధ్యక్షుడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ జంటకు వైట్ హౌస్ కార్యకలాపాల గురించి, అధ్యక్ష పాలన యంత్రాంగం గురించి క్షుణ్ణంగా తెలుసు.

పదవీ విరమణ చేయనున్న అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు మధ్య సంప్రదాయపూర్వక సమావేశం శాంతియుతంగా అధికారం బదలీకి సూచిక అవుతుంది. అయితే. 2020లో ఈ సంప్రదాయానికి విరామం ఎదురైంది. అప్పటి ఎన్నికలో తన ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ట్రంప్ హాజరు కాలేదు. ఇక పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె వారసుడు జెడి వాన్స్ మధ్య కూడా అటువంటి సమావేశం ఏర్పాటు అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News