వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 25వ తేదీన ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనితోపాటు ఆ దేశ సిఇఓ డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లాను వైట్ హౌస్‌లో కలుసుకోనున్నారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో ఉభయ దేశాల మధ్య స్నేహసంబంధాలపై వీరు ప్రధానంగా చర్చలు జరుపుతారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఆదివారం తెలిపారు.
ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనితో పాటుహై కౌన్సిల్ ఫర్ నేషనల్ రికాన్సిలియేషన్ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లాలతో భేటీపై బైడెన్ ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ దేశ మహిళలు, బాలికలు, మైనారిటీలతోసహా ఆ దేశ ప్రజలకు దౌత్యపరమైన, ఆర్థిక, మానవత్వంతోకూడిన సహాయాన్ని అందచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని సాకి చెప్పారు. అమెరికాకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద సంస్థలకు ఆఫ్ఘన్ ఇక ఏనాటికీ సురక్షిత స్థావరం కారాదన్నదే అమెరికా లక్ష్యమని, ఈ దిశగానే ఆ దేశ అధ్యక్షునితో బైడెన్ చర్చలు జరుపుతారని సాకి చెప్పారు. ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి స్థాపన ప్రక్రియకు అక్కడి రాజకీయ పక్షాలన్నీ సహకరించాలని అమెరికా కోరుతోందని ఆమె పేర్కొన్నారు.