Saturday, November 16, 2024

ప్రధాని మోడీకి బైడెన్ హామీ

- Advertisement -
- Advertisement -
Biden reiterates support for India's permanent seat
మండలి, ఎన్‌ఎస్‌జిలలో ప్రవేశం

వాషింగ్టన్ : ఐరాస భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి అమెరికా పూర్తి స్థాయి బాసట నిస్తుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తెలిపారు. మండలిలో ఇండియాకు స్థానం, అదే విధంగా కీలకమైన న్యూక్లియర్ సప్లయిర్స్ గ్రూప్ (ఎన్‌ఎస్‌జి)లోకి ప్రవేశానికి తమ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఇరువురు నేతల తొలి ముఖాముఖి భేటీ సందర్భంగా ప్రత్యేకంగా భద్రతా మండలిలోకి ఇండియా సభ్యత్వ అంశం ప్రస్తావనకు వచ్చింది. మండలి శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు అన్ని విధాలుగా అర్హత ఉంది. విశేషానుభవం ఉంది. అంతర్జాతీయ భద్రతా అంశాలపై పట్టుందని బైడెన్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ ఏడాది ఆగస్టులో మండలికి భారతదేశం సారధ్యం వహించిన దశలో కనబర్చిన పటిష్ట నాయకత్వ పటిమ ప్రశంసనీయం అని ప్రధాని మోడీతో ఈ దశలో బైడెన్ చెప్పారు.

ఇరువురు నేతల భేటీ తరువాత వెలువడ్డ సంయుక్త ప్రకటనలో మండలి, ఎన్‌ఎస్‌జిలలో భారత్‌కు స్థానం అంశాలు ప్రధానం అయ్యాయి. సంయుక్త ప్రకటనను ఆ తరువాత వైట్‌హౌస్ అధికార వర్గాలు వెలువరించాయి. పూర్తి సంస్కరణలతో కూడిన మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అవసరం అని , బహుముఖ స్థాయి అంతర్జాతీయ సహకార భద్రత దిశలో కీలక పాత్ర పోషించే దేశాలకు సముచిత స్థానం అవసరం అని తాము భావిస్తున్నట్లు బైడెన్ తెలిపారు. మండలిలో ఇప్పుడు రష్యా, చైనా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌లు ఐదు శాశ్వత సభ్యదేశాలుగా ఉంటూ వస్తున్నాయి. ప్రపంచస్థాయి ఎటువంటి కీలక తీర్మానంపై అయినా ఈ దేశాలకు వీటోతో వ్యతిరేకించే అధికారం ఉంది.

ప్రస్తుత మారిన మారుతున్న ప్రపంచ స్థాయి పరిస్థితులు, వాస్తవికత కోణంలో ఈ శాశ్వత సభ్యదేశాల సంఖ్యను పెంచాలని, రాజకీయ భౌగోళికతలను పరిగణనలోకి తీసుకుని మండలి శాశ్వత సభ్యత్వ దేశ పరిమితిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ కోణంలో ఇండియా అన్ని విధాలుగా ఇందుకు అర్హ దేశం అని , ఈ విషయంలో తమ నుంచి మద్దతు ఉంటుందని బైడెన్ తెలిపారు. ఇక 48 దేశాలతో కూడిన ఎన్‌ఎస్‌జి ప్రపంచ స్థాయిలో అణు సంబంధిత వ్యాపార వాణిజ్యాల నియంత్రణ అంతా ఈ బృందం పరిధిలోనే ఉంటోంది. ఇందులో సభ్యత్వం కోసం ఇండియా 2016 మేలో దరఖాస్తు చేసుకుంది. అయితే ఎన్‌పిటిపై సంతకాలు చేసిన దేశాలకే సభ్యత్వం ఇవ్వాలని పేర్కొంటూ చైనా తరచూ ఇండియా ప్రవేశాన్ని అడ్డుకొంటోంది. ఎన్‌పిటిపై ఇండియా, పాకిస్థాన్‌లు సంతకాలు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News