వాషింగ్టన్ : జో బైడెన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్లకు సరెండర్ అయ్యాడని, అఫ్ఘన్ నుంచి సేనల ఉపసంహరణ ఆయన ఘోర వ్యూహాత్మక తప్పిదం అని అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్ విమర్శించారు. తన వారసుడిపై ట్రంప్ తన అస్త్రం ప్రయోగించారు. వ్యూహాత్మక తప్పిదానికి దిగిన బైడెన్ అమెరికన్లకు బేషరతు క్షమాపణ చెపుతారా? అని ట్వీట్‌లో ప్రశ్నించారు. అక్కడి నుంచి సైనిక ఉపసంహరణ కేవలం తాలిబన్లకు బైడెన్ సరెండర్ అని తెలిపారు. చరిత్రలో ఇదో పెద్ద తప్పిదంగా నిలుస్తుందన్నారు. ముందు అమెరికన్లు బయటికి వచ్చిన తరువాత సైన్యాన్ని వాపసు తీసుకోవాలి. అంతేకానీ వారిని అక్కడనే తాలిబన్ల బారిన వదిలి సైన్యం తరలింపు తప్పే, అంతకు మించిన నేరం ఘోరం అవుతుందని ట్రంప్ తన వారసుడిపై మండిపడ్డారు. అమెరికన్లను చావుకు వదిలిపెట్టి రావడం బాధ్యతారాహిత్యం అని ఆక్షేపించారు. కాబూల్‌లో తాలిబన్ల ఆక్రమణ నాటి నుంచి ఇప్పటివరకూ బైడెన్ వైఖరిని ఖండిస్తూ ట్రంప్ ట్వీట్ల పరంపర సాగిస్తూ వస్తున్నారు.