గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న వేళ ఈ సందిగ్ధతను తొలగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్లు వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. ఆయన జోర్డాన్‌కూ వెళ్తారని, అక్కడ ఈజిప్టు, పాలస్తీనా, జోర్డాన్ దేశాధినేతలతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. క్రూరమైన హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే బైడెన్ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపింది.అలాగే తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా ఆయన ఇజ్రాయెల్ అధికారులతో చర్చిస్తారని వెల్లడించింది. అక్కడినుంచి జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు వెళతారని తెలిపింది.అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్‌సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమవుతారని తెలిపింది.పాలస్తీనా ప్రజల గౌరవం, స్వయంనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించబోదని బైడెన్ ఈ భేటీలో పునరుద్ఘాటిస్తారని తెలిపింది.
అలాగే గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించీ చర్చిస్తారని తెలిపింది.అంతకు ముందు బైడెన్ ఈజిప్టు అధ్యక్షుడితో పాటు ఇరాక్ ప్రధాని మహమ్మద్ శియా అల్‌సుడానీతోను ఫోన్‌లోమాట్లాడారు. హమాస్ దాడి తర్వాత ఆ ప్రాంతంలోని పరిస్థితులపై ఆరా తీశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకొంటున్నటుల ఆ దేశాల నేతలు తెలిపారు. గాజాలో మానవతా సంక్షోభం,దాని నివారణకు ఐరాస సమన్వయంతో తీసుకొంటున్న చర్యలపైనా చర్చించారు. మరో వైపు గాజాలో బందీలను విడిచిపెట్టాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హమాస్‌కు విజ్ఞప్తి చేశారు. మానవతా సాయాన్ని అడ్డుకోవద్దని ఇటు ఇజ్రాయెల్‌కూ హితవు పలికారు.