లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం(మార్చి 1) స్టేట్ ఆఫ్ ది యూనియన్(సంయుక్త పార్లమెంట్ సమావేశం)లో చేసిన ప్రసంగాన్ని 3.82 కోట్ల మంది ప్రేక్షకులు టీవీల ద్వారా వీక్షించారని నీల్సన్ రేటింగ్స్ తెలిపింది. అయితే..2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని 3.72 కోట్ల మంది వీక్షించడంతో పోలిస్తే ఇప్పటి వీక్షకుల సంఖ్య పెరిగినప్పటికీ 2018లో ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని వీక్షించిన 4.56 కోట్ల సంఖ్యను ఇది అధిగమించలేదకపోయింది. 2021లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ పార్లమెంట్‌లో చేసిన తొలి ప్రసంగాన్ని 2.7 కోట్ల మంది టీవీల ద్వారా వీక్షించగా 2017లో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రసంగాన్ని 4.77 కోట్ల మంది వీక్షించారని నీల్సన్ పేర్కొంది. గత మంగళవారం దాదాపు గంటపాటు బైడెన్ చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన 16 నెట్‌వర్క్, చానెళ్ల రేటింగ్స్‌ను నీల్సన్ పరిగణనలోకి తీసుకుంది. బైడెన్ తన ప్రసంగంలో ప్రధానంగాఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను, ద్రవ్యోల్బణాన్ని, కరోనా వైరస్ పరిస్థితిని ప్రస్తావించారు.