మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోవడం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇప్పటికే ఆ ప్రభావం మొదలైందన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు అసలైన ప్రత్యామ్నాయంగా బిఆర్‌ఎస్‌ను చూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మనపై పెట్టుకున్న విశ్వాసంలో ఒక్క రవ్వంత కూడా తగ్గవద్దని సూచించారు. హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కెటిఆర్ సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకు లు బిఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ కెటిఆర్ గులాబీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, దేశంలో గుణాత్మక మార్పులకు బిఆర్‌ఎస్ శ్రీకారం చుట్టుబోతున్నదన్నారు.
టిఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఆదరించిన విధం గా బిఆర్‌ఎస్‌ను కూడా దేశ ప్రజలు అ క్కున చేర్చుకోనున్నారన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు… దేశానికే ఆదర్శంగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలంతా కెసిఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారన్నా రు. బిఆర్‌ఎస్‌గా మారినా….రాష్ట్రంలో మనకు ఎలాంటి ఢోకా లేదని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలంగా ఉందన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా…ప్రజలు గులాబీ జెండాకే పట్టం కడుతున్నారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సిఎం కెసిఆర్ అగ్రస్థానంలో తీసుకపోతున్నారన్నారు.
వివిధ వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా పనిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావాలని ఆయా రాష్ట్ర ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. మన పథకాలు బాగున్నాయే కాబట్టే…ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష మేరకే కెసిఆర్ బిఆర్‌ఎస్ పేరుతో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోకి వస్తున్న కొత్తగా వస్తున్న నేతలకు కూడా తగు ప్రాముఖ్యత నిస్తామన్నారు. పాత, కొత్త నేతల కలయికతోనే రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిద్దామన్నారు.
కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ ఈసారి మంచి విజయాలు సాధించబోతున్నదన్నారు, అందరూ కలిసి కట్టుగా విజయం ఏకపక్షమయ్యేలా పనిచేయాలని కెటిఆర్ సూచించారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధి పై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో అక్కిరెడ్డి సంజీవరెడ్డితో పాటు కరకగూడెం సర్పంచ్ రామనాథం, మదర్ సాహెబ్, సోమరాజు,కుడితిపుడి కోటేశ్వరరావు, బూర నర్సయ్య,గోగ్గలి నరసయ్య, సుబ్బారావు, నిమ్మ లింగారెడ్డి తదితరులు ఉన్నారు.