ఐఇడిల తయారీపై పోలీసు కమిషనర్ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ రాజధానివ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో పేలుళ్లు సృష్టించడానికే సీమాపురి ప్రాంతంలో గురువారం లభించిన ఐఇడి(ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్), గత నెల ఘాజీపూర్‌లో దొరికిన ఐఇడిలు తయారు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా వెల్లడించారు. స్థానికుల మద్దతు లేకుండా అటువంటి కార్యకలాపాలు చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. ఈశాన్య ఢిల్లీలోని పాత సీమాపురి ప్రాంతంలోగల ఒక ఇంట్లో ఒక బ్యాగులో ఐఇడి లభించడంతో నగరంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. 2.5 కిలోల బరువున్న ఈ ఐఇడిని పోలీసులు నిర్వీర్యం చేసి ఆ ఇంటి యజమానితోపాటు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం నగర పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్తానా విలేకరులతో మాట్లాడుతూ గత నెల 17న ఘాజీపూర్‌లో, గురువారం పాత సీమాపురి ప్రాంతంలో ఐఇడిలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో పేలుళ్లు సృష్టించే ఉద్దేశంతోనే ఈ ఐఇడిలు తయారు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు.