మనతెలంగాణ/ హైదరాబాద్ : గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ మండిపడ్డారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ కొద్ది గంటల్లో గణేష్ నిమజ్జనం జరగాల్సి ఉన్నప్పటికీ ఏర్పాట్లే పూర్తి చేయలేదని, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళ సై తిరస్కరించడం ముమ్మాటికీ సరైన నిర్ణయమే అన్నారు. గవర్నర్ తన విచక్షణాధికారులను ఉపయోగించి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలనుకుంటోంది. వాళ్లు పంపిన ఫైళ్లన్నీ చూడకుండా సంతకం పెట్టాలనుకుంటోంది. గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తే ఆమెకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. ఇది సరి కాదు.. వాళ్లకు నచ్చినట్లు లేకుంటే విమర్శలు చేయడం సరికాదు అన్నారు.