Sunday, November 17, 2024

కేజ్రీవాల్‌కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యానికి ఆస్కారం లేదని తాము భావిస్తున్నట్లు తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. పిల్‌లో కోరినట్లు తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. ఈ పిల్‌లోని న్యాయాన్యాయాల గురించి తాము వ్యాఖ్యానించదలచలేదని పేర్కొంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హులు అని తెలియచేసే నిబంధనలు ఏవైనా చూపవలసిందిగా పిటిషనర్‌ని ధర్మాసనం కోరింది.

రాజ్యాంగపరమైన వైఫల్యం ఏదైనా జరిగితే రాష్ట్రపతి లేదా గవర్నర్ చర్యలు తీసుకుంటారని, కొంత సమయం పట్టవచ్చు కాని వారే దీనిపై నిర్ణయం తీసుకోగలరని తాము భావిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈరోజు ఈ పరిస్థితిని ఊహించలేదని, దీనికి న్యాయపరమైన ఆంక్షలేవీ లేవని జస్టిస్ మన్మోహన్ అన్నారు. ఈ రాజకీయాలలో తాము తలదూర్చబోమని, దీనిపై రాజకీయ పార్టీలే స్పందిస్తాయని, వారు ప్రజల వద్దకు వెళతారని, తాము ఆ పని చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని 163, 164 అధికరణను పిటిషనర్ ఉటంకిస్తూ ప్రస్తుతం జైలులో ఉన్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తన విధులు, బాధ్యతలను నిర్వర్తించడానికి అనర్హులని తెలిపారు. ఆర్థిక కుంభకోణంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి జైలులో ఉండి పదవిలో కొనసాగడానికి అనుమతించరాదని పిటిషనర్ కోరారు. ఇది న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించడమేగాక రాష్ట్ర రాజ్యాంగ యంత్రాంగ ప్రతిష్టకు భంగకరమని ఆయన వాదించారు. అయితే దీనిపై హైకోర్టు మాత్రం ఏకీభవించలేదు.

ఈ అంశాన్ని ప్రభుత్వం, రాష్ట్రపతి పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో న్యాయరమైన జోక్యానికి ఆస్కారం ఎక్కడుందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలిస్తున్నట్లు ఈ రోజు పత్రికలలో చూశామని, ఇది రాష్ట్రపతి పరిశీలనకు తప్పకుండా వెళుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రపతికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు తాము ఎందుకు మార్గదర్శకాలు జారీచేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. అవసరమైతే ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తుందని, వారికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత తమకు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న అరెస్టు అయిన కేజ్రీవాల్ జైలు నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఆయన ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారని కేంద్రాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ కార్యదర్శిని ప్రశ్నించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News