52 రోజుల తర్వాత బయటకు
రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఎపి హైకోర్టు తీర్పు వెలువరించింది. నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీని పైన వాదనలు పూర్తయిన తరువాత కోర్టు మంగళ వారం తీర్పు వెలువరించింది. దీంతో, 52 రోజుల రిమాండ్ తరువాత చంద్రబాబుకు బెయిల్ లభించింది.
ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదల అయ్యారు. ఉదయం పదిన్నరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వచ్చింది. వెంటనే షరతుల మేరకు ఎసిబి కోర్టులో రెండు ష్యూరిటీలను దేవినేని ఉమ, బొండా ఉమ సమర్పించారు. ఆ తర్వాత రిలీజ్ ఆర్డర్‌ను ఎసిబి కోర్టు నుంచి జైలుకు పంపించారు. లాంఛనాలు పూర్తి కావడంతో నాలుగు గంటల సమయంలో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ఆయన జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన కాన్వాయ్ ఉండవల్లి నుంచి రాజమండ్రికి వచ్చింది. ఎన్‌ఎస్‌జి సెక్యూరిటీ మొత్తం జైలు వద్దకు వచ్చింది. చంద్రబాబు కుటుంబసభ్యులు అందరూ జైలు వద్దకు వచ్చారు. నారా లోకేష్, బాలకృష్ణ కూడా వచ్చారు. పెద్ద ఎత్తున జనం రావడంతో వారిని అదుపు చేసేందుకు కిలోమీటర్ ముందే పోలీసులు బారీకేడ్లను పెట్టారు. అయితే టిడిపి కార్యకర్తలు తోసేసుకుని వెళ్లిపోయారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో యాభై రోజుల పాటు ఎప్పుడూ బయట కనిపించకుండా ఉండలేదు.
ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు. చంద్రబాబు ర్యాలీచేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఎలాంటి ర్యాలీలు చేయడం లేదని టిడిపి స్పష్టం చేసింది. చంద్రబాబు విడుదల వుతున్న సమయంలోనే ఎపి సిఐడి అధికారులు హడావుడిగా హైకోర్టులో లంట్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీలు చేయకుండా చూడాలని, మీడియాతో మాట్లాడవద్దని, డిఎస్పీలు ఆయనపై నిఘా పెట్టేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఎపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బుధవారం వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని, బుధవారం వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు నిర్దేశించింది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై తీర్పు సుప్రీంకోర్టులో ఎనిమిదో తేదీలోపు రానుంది. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి చంద్రబాబు తదుపరి న్యాయపోరాటం ఉండే అవకాశం ఉంది. ఒక వేళ చంద్రబాబుకు 17ఎ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెబితే ఆయనపై పెట్టిన కేసులేవీ చెల్లవు. ఆయనకు విధించిన రిమాండ్‌కు చట్టవిరుద్ధంగా ప్రకటించినట్లవుతుంది. ఒక వేళ 17ఎ వర్తించదనుకుంటే ఆయన తనపై నమోదైన కేసుల విషయంలో న్యాయపోరాటం చేయాల్సి ఉంటుంది.
‘45 ఏళ్లలో ఏ తప్పు చేయలేదు, చేయను, చేయబోను’
తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని టిడిపి అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. జైలు నుండి విడుదలైన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తనకు మీరందరూ మద్దతు తెలిపారన్నారు. తనకు మద్దతుగా రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. అంతేకాదు తాను జైలు నుండి విడుదల కావడం కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.తనపై ప్రజలు చూపిన అభిమానాన్ని తాను ఏనాడూ మర్చిపోలేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ, విదేశాల్లో కూడ తనకు సంఘీభావం తెలిపారన్నారు. తాను చేపట్టిన విధానాల వల్ల లబ్దిపొందినవారంతా మద్దతిచ్చారన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తప్పు చేయడాన్ని తాను ఏనాడూ కూడ సమర్ధించబోనని వివరించారు. తాను ఏనాడూ తప్పు చేయలేదు, చేయను, చేయబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు సంఘీభావ ర్యాలీల గురించి ప్రస్తావించారు. తనకు సంఘీభావం ప్రకటించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను జైలులో ఉన్న సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బిజెపి, సిపిఐ, బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని కొందరు నేతలు తనకు సంఘీభావం తెలిపారన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన కోసం ఆందోళనలు నిర్వహించారన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు నిర్వహించిన విషయాన్ని వివరించారు.
చంద్రబాబు సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణలు ఎదురెల్లి స్వాగతం పలికారు. చంద్రబాబుకు కుటుంబ సభ్యులతోపాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుతోపాటు మరికొంతమంది టిడిపి నేతలు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి అభిమానులు, నేతలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రధాన గేటు వద్దకు తరలి రావడంతో అక్కడ సందడి నెలకొంది. ఇకపోతే చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ప్రధాన గేటు వరకు కాలినడకన చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఎన్‌ఎస్‌జి వాహనం వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఉండవల్లి బయల్దేరారు.
52 రోజుల తర్వాత తాతను చూసిన దేవాన్ష్ ఏం చేశాడంటే?
చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలవ్వడంతో దేవాన్ష్ ను తీసుకుని నారా బ్రాహ్మణి, బాలకృష్ణ రాజమండ్రి జైలు ప్రాంగణం వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే చంద్రబాబు తొలి చూపు మనవడు దేవాన్ష్ పైనే పడింది. మనవడిని చూసి ఆయన ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దేవాన్ష్ కూడా తాతను పెనవేసుకుని కాసేపు అలా నిలుచుండిపోవడం అక్కడ చూసే వారికి కంట తడి పెట్టించింది. దేవాన్ష్ ను హత్తుకున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచింది : నారా భువనేశ్వరి
చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారన్న సమాచారంతో నారా భువనేశ్వరి భావోద్వేగాలకు లోనయ్యారు. ఈ 53 రోజుల పాటు ఎంతో వేదనకు గురయ్యానని తెలిపారు. తట్టుకోలేనంత బాధతో క్షణమొక యుగంలా గడిచిందని వెల్లడించారు. ఈ కష్టకాలంలో తెలుగుజాతి ఇచ్చిన మద్దతు ఊరట కలిగించిందని చెప్పారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మద్దతు ఇచ్చారని వివరించారు. రాజమండ్రి ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని భువనేశ్వరి తెలిపారు. దేవుడి దయతో రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆమె ఆకాంక్షించారు.
మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ ఏ కేసులోనూ చర్యలు తీసుకోం : హైకోర్టుకు చెప్పిన సిఐడి
చంద్రబాబుపై ఎపి సిఐడి కొత్తగా నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఎపి హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఇతర ఏ కేసుల్లో చంద్రబాబుపై చర్యలు తీసుకోమని కోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడించారు. మద్యం కేసులో 15న కౌంటర్ దాఖలు చేస్తామని ఎజి తెలిపారు. దీంతో కేసు విచారణ నవంబర్ 21కి హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఎసిబి కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు ఎసిబి కోర్టు ప్రకటించింది.
మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న కేసులో ఎ1గా నరేష్, ఎ2గా కొల్లు రవీంద్ర, ఎ3గా చంద్రబాబు పేర్లను సిఐడి నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై పలు అభియోగాలను చేర్చింది. పిసి యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా సిఐడి వెల్లడించింది. ఇప్పటికే చంద్రబాబుపై పలు కేసులు ఉన్నాయి. అందులో ఎపి ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబును చేర్చగా స్కిల్ స్కామ్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం ఆయనకు బెయిల్ దొరికింది. సెప్టెంబర్ 9వ తేదిన ఆయన్ని సిఐడి అధికారులు అరెస్ట్ చేయగా 52 రోజుల తర్వాత ఆయనపై మరో కేసును సిఐడి అధికారులు నమోదు చేశారు. వెంటనే ఎపి సిఐడి నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఆ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించి, విచారణ జరిపింది. రాత్రికి రాత్రి కేసు నమోదు చేసిన సిఐడి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం సమయం కావాలని కోరింది. మధ్యంతర బెయిల్ ఇచ్చినందున, అప్పటి వరకూ చర్యలు తీసుకోబోమని చెప్పడంతో విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
వందల కిలోమటర్లు .. వేలాది మంది తోడుగా .. అడిగో మహరాజు .. పులిలా కదిలాడు #CBNSatyamevaJayate #ChandrababuNaidu#BabuIsBack pic.twitter.com/Yuv7oFFRVK
— Gangadhar Thati (@GangadharThati) October 31, 2023