ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 2019లో దాఖలైన కేసులో మాజీ ఎంపి జయప్రదకు భారీ ఊరట లభించింది. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ రాంపూర్‌లోని ప్రత్యేక ఎంపి/ఎమ్మెల్యే కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి 2019 ఎన్నికలలో పోటీ చేసిన సందర్భంగా జయప్రదపై స్వర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఆమె తరఫు న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా విలేకరులకు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా ఆమె నూర్పూర్ గ్రామంలో బహిరంగ సభను నిర్వహించి రోడ్డును ప్రారంభించారని ఆమెపై ఫిర్యాదు నమోదైందని ఆయన చెప్పారు. ఆ ఎన్నికలలో ఆమె బిజెపి టిక్కెట్‌పై రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఆయన చెప్పారు.
రోపణలకు తగిన ఆధారాలు లేవన్న కారణంతో జయప్రదను నిరపరాధిగా న్యాయమూర్తి శోభిత్ బన్సాల్ తీర్పు చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా..కోర్టు తీర్పుపై జయప్రద హర్షం వ్యక్తం చేశారు. రాంపూర్‌కు తాను రాకుండా కొందరు కుట్ర పన్నుతున్నారని, అయితే రాంపూర్ తనకు రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడకు తరచు వస్తూనే ఉంటానని జయప్రద విలేకరులకు తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో తాను రాంపూర్ నుంచే పోటీ చేస్తానని కూడా ఆమె ప్రకటించారు. అయితే సంభాల్ జిల్లాలోని కుందర్కీ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న ఊహాగానాల గురించి ప్రశ్నించగా దీనిపై పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోగలదని ఆమె చెప్పారు.