Thursday, September 19, 2024

తెలంగాణ పామ్ ఆయిల్ రైతులకు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

కేంద్రప్రభుత్వం వంటనూనెల దిగుమతిపై తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఆయిల్‌పాం రైతులకు భారీ ఊరట దక్కనుందని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి రాష్ట్ర రైతుల తరఫున వ్యవసాయాశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఙతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 శాతం నుండి 27.5 శాతం కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని, రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్ ఆయిల్ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇటీవల మన రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిశివరాజ్ సింగ్ చౌహన్ కి ఈ విషయంపై వివరించామన్నారు.

ఆయిల్ పామ్ రైతులు కూడా ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. మంత్రి చొరవతో సెప్టెంబర్ 13 న కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 శాతం నుండి 27.5 శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. దీనివలన ప్రస్తుతం టన్నుకు రూ. 14,392- గా ఉన్న ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు కనీసంగా రూ. 1500నుండి రూ. 1700 వరకు పెరిగి టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ. 16,500- దాటే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,400 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుందన్నారు ఈ దిగుమతి సుంకం పెంచడం వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని,

అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని మంత్రి పేర్కొన్నారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం అయిన నేషనల్ మిషన్ ఆన్‌ఎడిబుల్ ఆయిల్స్- ఆయిల్పామ్ ద్వారా అమలు చేయబడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడం జరిగిందని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.00 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావడ మైందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుతుందని, అలాగే రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేపట్టుటకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

ఇందుకోసం ఆయిల్ పామ్ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా (44) నర్సరీలు ఏర్పాటుచేశాయన్నారు.
ఈ అవకాశాన్ని రాష్ట్ర రైతులు సద్వినియోగం చేసుకుని, రైతులు భారీగా పామ్ ఆయిల్ సాగు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News