మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో కర్ణాటక పోలీసులు విచారణ జరుపుతుండగా మరిన్ని కీలక అం శాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం వారు ఎఫ్‌ఐఆర్‌ను సవరించారు. రేవ్ పార్టీ లో పాల్గొన్న వారి రక్త నమూనాలను ఆ రోజే సేకరించి పరీక్షలకు పంపగా ఆ టెస్టుల్లో పా జిటివ్ వచ్చిన తెలుగు నటుల వివరాలను కూడా వెల్లడించారు. తెలుగు నటి పేరు క్రిష్ణవేణి అని, మరో నటి అషి రాయ్‌లకు పాజిటివ్ అని తేలిందని పోలీసులు వెల్లడించారు. హేమ కృష్ణవేణి పేరుతో ఈ రేవ్ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీస్ రికార్డుల్లోనూ అదే పేరు ఉందని తెలుస్తోంది. తెలుగు నటులు బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు తేలడంతో హైదరాబాద్ నా ర్కోటిక్ పోలీసులు సైతం వారిని విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో 73 మంది యువకులు పార్టీలో పాల్గొనగా 59 మందికి పాజిటివ్ వచ్చిందని, 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే, 86 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. డ్రగ్‌టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు. ఈ రేవ్ పార్టీని హెబ్బగుడి పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ నిర్వహించిన నిందితుల్లో A1గా వాసు, A2గా అరుణ్ కుమార్, A3 నాగబాబు,
A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డి, A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులు ఉన్నట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. రేవ్ పార్టీ నుంచి 14.40 గ్రాముల ఎండిఎంఎ పిల్స్, 1.16 గ్రామ్స్ ఎండిఎంఎ క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్, కొకైన్ తో ఉన్న 500 రూపాయల నోట్లు, 5 మొబైల్ ఫోన్స్, ఒక ఫోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, కోటిన్నర విలువైన డిజె ఎక్విప్మెంట్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. పార్టీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి A2 అరుణ్ కుమార్ అని, ఫామ్ హౌస్ బుక్ చేసిన వ్యక్తి వాసు స్నేహితుడు గోపాల్ రెడ్డి అని ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించారు. A4 అయిన రణధీర్ కారులో డ్రగ్స్ లభ్యం అయినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చట్టం గుర్తిస్తుంది. కాబట్టి వారిని రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలిస్తారు. కేసులు ఉండవు. డ్రగ్స్ సరఫరా చేసిన వారిని మాత్రమే అరెస్టు చేసి రిమాండుకు పంపుతారు. డ్రగ్స్ తీసుకున్న సెలబ్రిటీలతో పాటు ఇతరులను కౌన్సిలింగ్ చేసి , పునరావాస కేంద్రానికి తరలిస్తామని బెంగుళూరు పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరికీ పోలీసులు నోటీసులు పంపనున్నారు. అనంతరం వీరిని పిలిపించి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు.? అనే దానిపై ప్రశ్నించనున్నారు.
అసలేం జరిగింది?
ఈ నెల 19న రాత్రి బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. స్థానిక జిఆర్ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో వాసు అనే వ్యక్తి పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు చెబుతున్నారు. డిజెలతో సౌండ్ చేయడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేసి రేవ్ పార్టీ అని గుర్తించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా లభ్యమయ్యాయి. ఈ పార్టీలో తెలుగు రాష్టాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. టీవీ నటులు సహా, మోడల్స్, పలువురు వ్యాపార, రాజకీయ వారసులు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.
ప్రచారం ఖండిస్తూ నటి హేమ వీడియోలు
బెంగుళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పట్టుబడినట్లు తొలుత కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. తనను ఏ రేవ్ పార్టీలోనూ పట్టుకోలేదని.. ఆ వీడియోలో చెప్పారు. అనంతరం, ఆమె వీడియో విడుదల చేసిన సాయంత్రమే హేమ తమ అదుపులోనే ఉంది అంటూ బెంగుళూరు పోలీసులు ఓ ఫోటో విడుదల చేశారు. ఆ తర్వాతి రోజు కూడా హేమ బిర్యానీ వండుతూ మరో వీడియో రిలీజ్ చేశారు. రెండు రోజుల్లో అన్నీ చెబుతా అంటూ స్పష్టం చేశారు. అయితే, తాజాగా, పోలీసులు మాత్రం హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
హేమ బెంగళూర్ వెళ్లింది నిజమే..!
బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. “ లేదు.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను” అంటూ హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు కూడా రిలీజ్ చేసి తన పరువు తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని బయటపడింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో కచ్చితమైన ఆధారం లభించింది. నటి హేమ మే 18న (శనివారం) రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారు. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్‌కు హేమ అండ్ కో వెళ్లారు.
ఎవరీ వాసు..!?
బెంగళూరు ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించిన వాసుది విజయవాడ. విజయవాడలో ఒక సామాన్య కుటుంబం నుంచి అడ్డదారిలో ఎదిగి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వాసు అన్ని అసాంఘిక కార్యక్రమాలకు తెరతీశారంటారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అతి స్వల్ప కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించిన వాసు ఆస్తులను భారీగానే కూడబెట్టారని చెబుతున్నారు. వాసుకి చిన్న నాటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. అయితే ఆ పిచ్చే అతనని బెట్టింగ్‌ల వైపు నెట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్, ముంబయి, చెన్నై ఇలా ఇతర రాష్ట్రాల్లో తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని కొద్ది కాలంలోనే వాసు విస్తరించగలిగాడు.
వాసుది విజయవాడలో సాధారణ కుటుంబం. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. దీంతో వాసు తల్లి దోసెలు వేసుకుని వాసును పెద్దవాడిని చేసింది. వాసుకు ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. కానీ వాసు మాత్రం పెడదారిని ఎంచుకున్నారు. దానిని రాచమార్గంగా మలచుకోవాలని భావించాడు. క్రికెట్ బుకీగా మారడంతో ఆయనకు ఆయాచితంగా డబ్బు వచ్చి పడేది. వాసు కుటుంబం విజయవాడ ఆంజనేయ వాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధిలో వాసు కుటుంబం నివసించేది. అయితే ఎవరికీ ఈ స్థాయికి వెళ్లేందుకు అడ్డదారులు తొక్కాడని తెలి యదు. ఇతర దేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నానని నమ్మించాడు. క్రికెట్ పై అభిమానంతో ఆ ఆట రాకపోయినా బెట్టింగ్‌లకు పాల్పడేవారు. ఇందు కోసం గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు ఎపిలోని విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, కర్నూలు తదితర పట్టణాల్లో తన గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇతని నెట్ వర్క్ కింద వందల సంఖ్యలో పనిచేస్తున్నారు. అందరికీ వేతనాలు భారీగానే చెల్లిస్తుండటంతో వాసుకు అమాంతం సమాజంలో గౌరవం కూడా పెరెగింది. వాసుకు పెళ్లి అయింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. వాళ్లంతా విజయవాడలోనే ఉ:టారు. పెద్ద పెద్ద కార్లలో వస్తుండటంతో వాసు విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తు న్నాడని చుట్టుపక్కల వారు భావించేవారు. కోటి రూపాయల విలువైన నాలుగు కార్లు వాసు కొనుగోలు చేశాడు. దీంతో పాటు అనేక ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లు కొనుగోలు చేశాడు. అక్రమ సంపాదనే లక్ష్యంగా వాసు ఎదిగిన తీరును చూసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడలలో విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. అయితే రేవ్ పార్టీలు నిర్వహిస్తూ కొందరు ధనికుల సంతానం కళ్లలో పడ్డాడు. పార్టీలకు సెలబ్రిటీలను రప్పించడంతో పార్టీ అంటే వాసు పేరు గుర్తుకు వచ్చేలా చేసుకున్నాడు. అంతే దశ మరింత తిరిగింది. ఇంత వరకూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకున్న వాసు చివరకు బెంగళూరు రేవ్ పార్టీలో దొరకడంతో ఇప్పుడు అందరి నోళ్లలో నానుతు న్నారు.