Monday, December 23, 2024

పొంగులేటికి షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన అనుచరులు షాకిస్తున్నారు. ఒక్కొక్కరుగా తిరిగి బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుంగు అనుచరుడు, భద్రాచలం నియోజకవర్గం లో తాను పార్టీలో చేరక ముందే అభ్యర్థిగా ప్రకటించేసిన తెల్లం వెంకట్‌రావు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. గురువారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుల సమక్షంలో తెల్లం వెంకట్రావు బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవల పొంగులేటితో పాటు తెల్లం వెంకట్రావు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశంలో నడిచిన ఆయన బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.

2018లో బిఆర్‌ఎస్ నుంచి భద్రాచలం ఎంఎల్‌ఎగా తెల్లం వెంకటరావు పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. పొంగులేటినే గత ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించడంతో ఈసారి కూడా ఆయన పార్టీలో లేకపోతే టిక్కెట్ రాదేమోనన్న ఉద్దేశంతో పొంగులేటి వెంట నడిచారు. త ను ఏ పార్టీలో చేరిన తన అనుచరులందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని పొంగులేటి చెబుతూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అందరికీ టిక్కెట్లు ఇప్పించడం కష్టంగా మారింది. భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎంఎల్‌ఎ ఉండటంతో తనకు మళ్లీ అవకాశం రాదని తెల్లం వెంకట్రావు ఫీలయ్యారు. అదే సమయంలో బిఆర్‌ఎస్ కీలక నేతలు వెంకట్రావును సంప్రదించారు. దీంతో ఆయన పార్టీ మారిపోవాలని నిర్ణయించుకున్నారు.

పొంగులేటి చేరికతో హస్తం నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కాం గ్రెస్‌లో నేతల మధ్య అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి నియమితులయ్యారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరే ముందే పలు నియోజకవర్గాలకు పొంగులేటి అభ్యర్థులను ప్రకటించారు. అలా ప్రకటించిన చోట్ల టిక్కెట్లు కేటాయించలేరు. అశ్వారావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి ప్రకటించారు. కానీ అక్కడ కాంగ్రెస్‌లో తాటి వెంకటేశ్వర్లు ఉన్నారు. పొంగులేటి 2014లో వైసిపి తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన సమయంలో వైసిపి తరపున అశ్వారావుపేట నుంచి తాటి వెంకటేశ్వర్లు ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. ఆ తర్వాత పొంగులేటి వెం ట టిఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు. అక్కడ టిడిపి తరపున గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరగా, తనకు పార్టీలో ప్రాధాన్యత లేదంటూ గతేడాది తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచే పొంగులేటిని విభేదించి ఆయనకు దూరం గా ఉన్నారు. దీంతో తన వర్గం అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి ప్రకటించారు.

ఆ తర్వాత పరిణామాల్లో ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయినా గత విభేదాల దృష్ట్యా తాటిని పొంగులేటి దూరం పెడ్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సత్తుపల్లి లీడర్ డాక్టర్ మట్టా దయానంద్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. 2014లో సత్తుపల్లిలో వైసిపి తరపున పోటీ చేసి, కొద్ది ఓట్ల తేడాతో సండ్రపై ఓడిపోయారు. తర్వాత పొంగులేటి వెంట అప్పటి టిఆర్‌ఎస్ చేరారు. 2018లో టిఆర్‌ఎస్ తరపున టికెట్ ఆశించినా దక్కలేదు. కొద్ది నెలల క్రితం పొంగులేటితో విభేదించి, ఆయన కంటే ముందుగానే దయానంద్ కాంగ్రెస్‌లో చేరారు. సత్తుపల్లి పర్యటనకు రెండ్రోజుల ముందు కూడా పొంగులేటిని దయానంద్ కలిసి సన్మానించారని, అయినా కావాలనే పొంగులేటి దూరం పెట్టారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనిపై 8 ప్రశ్నలతో సోషల్ మీడియాతో పోస్టింగులు పెట్టారు. అటు పొంగులేటి అనుచరులు.. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా… ఉక్కపోతకు గురి అవుతూండటంతో.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News