న్యూఢిల్లీ : లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయనకు కేరళ హైకోర్టు ఇచ్చిన ఊరటను సుప్రీం కోర్టు మంగళవారం పక్కన పెట్టేసింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ ఆరు వారాల వరకు గడువు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్టయింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఆ గడువు లోగా లక్షద్వీప్ పరిపలనా విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ కేసులో లోక్‌సభ ఎంపీని దోషిగా నిర్ధారించి శిక్ష విధించడాన్ని సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానం తప్పు అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయ పడింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్‌పై హత్యకు ప్రయత్నించినట్టు మహ్మద్ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు 2016 జనవరి 5న ఫైజల్ పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసు కొనసాగుతుండగానే 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. అయితే ఈ ఏడాది జనవరి 11న ఫైజల్‌తోపాటు , మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష , లక్ష రూపాయల జరిమానా కవరత్తి కోర్టు విధించింది. దీంతో ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 (3) ప్రకారం జనవరి 13న లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అనర్హత వేటు వేసింది. దీనిపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా అది తప్పుడు కేసు అని , ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్‌సభ సెక్రటేరియట్ జాప్యం చేసినా, చివరకు మార్చి 29న సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్ విడుదల చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన శిక్షను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు కేరళ హైకోర్టు తెలియజేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఫైజల్‌కు ఉపశమనం ఇవ్వడం , న్యాయప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుందని లక్షద్వీప్ పరిపాలనా విభాగం వాదనలు వినిపించింది.
సాలిహ్‌పై ఉద్దేశ పూర్వకంగానే ఫైజల్‌తోపాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా, ఇద్దరు విచారణ సమయంలో మరణించారని , లక్షద్వీప్ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35 లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా కవరత్తి కోర్టు నిర్ధారించి పదేళ్ల కారాగార శిక్ష విధించింది. మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది.