Monday, November 25, 2024

పర్యావరణ రక్షణలో పెద్ద పులి కీలకం

- Advertisement -
- Advertisement -

పులులను మనం కాపాడితే.. అడవితో పాటు మనల్ని కాపాడుతాయి
ఫారెస్ట్ కాలేజీలో ఘనంగా ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్ 

హైదరాబాద్ : అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలో తీసుకున్న సంరక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య బాగా పెరిగిందని, రానున్న రోజుల్లో మరింతగా పులుల ఆవాసాలను అభివృద్ది చేస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్ & హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ములుగు ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మారిన వాతావరణ పరిస్థితులు, పర్యావరణ రక్షణకు ముప్పుగా మారాయని, ఉన్న అడవుల సంరక్షణ మాత్రమే దీనికి అనువైన పరిష్కారమని అన్నారు.

అడవుల రక్షణకు పులుల ప్రాధాన్యతే కీలకం అని, పులులను మనం కాపాడితే, అవి అడవినీ, తద్వారా ప్రజలను కాపాడుతాయని అన్నారు. ఈ విషయం ప్రతీ ఒక్కరూ గ్రహించి, ఇతరులనూ చైతన్యవంతం చేయాలన్నారు. ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలు పులుల సంఖ్య పెరిగేందుకు దోహద పడ్డాయని, ప్రస్తుతం దేశంలో 3,167 పులులు ఉన్నాయని తెలిపారు. అడవికి రాజులా పులి వ్యవహార శైలి, ప్రవర్తన గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా డోబ్రియల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతతో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల్లో తీసుకున్న సంరక్షణ చర్యల వల్ల పులుల సంఖ్య బాగా పెరిగిందని, రానున్న రోజుల్లో మరింతగా పులుల ఆవాసాలను అభివృద్ది చేస్తామన్నారు. అటవీ ప్రభావిత గ్రామాల పరిసరాల్లో జంతువులు, మనుషుల మధ్య సంఘర్షణ నివారణకు కృషి చేస్తున్నామన్నారు. పులుల ఆవాసాల్లో అలజడిని తగ్గించేందుకు కోర్ ఏరియాల్లో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియను చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయం మేరకు భవిష్యత్ పర్యావరణవేత్తలను తీర్చిదిద్దుతున్న ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో రాష్ట్ర స్థాయి టైగర్ డే నిర్వహించటం శుభ పరిణామని డీన్ ప్రియాంక వర్గీస్ అన్నారు. అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం అత్యంత ఉపయోగకరం అని అన్నారు.

రాష్ట్ర స్థాయి అటవీ అధికారులు, ఉద్యోగులు, ఫారెస్ట్ కాలేజీ, ఫారెస్ట్ అకాడమీ (దూలపల్లి) నుంచి ట్రెయినీలు మొత్తం నాలుగు వందల మంది టైగర్ డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. టైగర్ థీమ్ గా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, ఉద్యోగులకు బహుమతులను అందించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల అభివృద్ది, పురోగతిపై ఫీల్డ్ డైరెక్టర్లు వినోద్‌కుమార్, క్షితిజలు కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పులుల రక్షణ కోసం అటవీశాఖ తీసుకుంటున్న చర్యలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఫారెస్ట్ కాలేజీలో కొత్తగా ప్రారంభిస్తున్న ఎం.ఎస్సీ (వైల్డ్ లైఫ్) బ్రోచర్ ను కార్యక్రమంలో ఆవిష్కరించారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ తరపున ఇమ్రాన్ సిద్దికీ తాము పులుల సంరక్షణ కోసం చేస్తున్న పనులను సమావేశంలో వివరించారు. కార్యక్రమంలో పిసిసిఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అడిషనల్ పిసిసిఎఫ్ (ఐ.టీ) వినయ్ కుమార్, సిసిఎఫ్ రామలింగం, హైదరాబాద్ సిసిఎఫ్ సైదులు, ఫారెస్ట్ అకాడెమీ డైరెక్టర్ ఆశ, ఫారెస్ట్ కాలేజీ అధికారులు శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News