న్యూయార్క్: ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలు, భారతీయ కమతాలకు తగిన యంత్రాలు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్ వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులు సందర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేయాలని, అమెరికా వ్యవసాయ కమతాలు అతి పెద్దవిగా ఉన్నాయని, దీంతో పోల్చుకుంటే భారతీయ కమతాలు ఎంతో చిన్నవన్నారు. చిన్న కమతాలకు సరిపోయేవిధంగా యాంత్రీకరణ జరిగితే రైతాంగానికి ఎంతో మేలు జరిగిందని, అంతర్జాతీయ పోటీని తట్టుకోవాలంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పంట ఉత్పాదకతను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అమెరికా యాంత్రిక వ్యవసాయంలో ఎకరాకు 30 వేల పత్తి మొక్కలు, అధిక సాంద్రత పద్దతిలో సాగుమూలంగా చీడపీడల బెడద తక్కువగా ఉందన్నారు. సగటున 1000 ఎకరాల నుంచి 5 వేల ఎకరాల కమతాలు, రోజుకు 70 టన్నులు పత్తి తీసే యంత్రాలు ఉన్నాయన్నారు. రోజుకు 52 నుండి 70 హెక్టార్లలో ఒకేసారి పత్తిని తీసే సింగిల్ టైమ్ హార్వెస్టర్ మిషన్ ఉందని, మిషన్ ధర 1 మిలియన్ యూఎస్ డాలర్లు ఉందని, రోజుకు 500 గ్యాలన్ల డీజిల్ అవసరం అవుతోందన్నారు. 200 ఏళ్లుగా అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ప్రధానపంట పత్తి అని, కాలక్రమంలో పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
టెన్నెన్సీ రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల ఎకరాల నుంచి 6.5 లక్షల ఎకరాలలో పత్తి సాగు అవుతోందని, ఏటా మిలియన్ బేళ్ల వరకూ ఉత్పత్తి అవుతోందని, నేషనల్ కాటన్ కౌన్సిల్ ఆఫ్ అమెరికాకు ఇది ప్రధాన కార్యలయంగా పనిచేస్తుందన్నారు. పర్యటనలో భాగంగా సింగిల్ పిక్ కాటన్ సాగు, విత్తన తయారీ కేంద్రం, జిన్నింగ్ మిల్ సందర్శించారు. సింగిల్ పిక్ కాటన్ లో ఒకేసారి దున్ని, విత్తనాలు విత్తడం, కలుపుమందు చల్లే యంత్రాన్ని పరిశీలించారు.