Sunday, December 22, 2024

రూ.34,615 కోట్ల అతిపెద్ద బ్యాంక్ మోసం

- Advertisement -
- Advertisement -

Biggest bank fraud of Rs 34,615 crore

డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ సిఎండి, డైరెక్టర్‌పై సిబిఐ కేసు నమోదు
ముంబైలోని 12 ప్రాంతాల్లో సోదాలు

న్యూఢిల్లీ : అతిపెద్ద బ్యాంకింగ్ మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ మాజీ సిఎండి కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్‌లపై సిబిఐ కేసు నమోదు చేసింది. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌పై సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) జరిపిన విచారణలో రూ.34,615 కోట్ల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 2010 నుంచి 2018 మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు దాదాపు రూ.34,615 కోట్ల రుణాలను ఇచ్చింది. ఈ భారీ బ్యాంకింగ్ మోసానికి సంబంధించి సిబిఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 50 మంది అధికారులతో కూడిన సిబిఐ బృందం ముంబైలోని 12 చోట్ల సోదాలు నిర్వహించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అమరిలిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ షెట్టి, ఎనిమిది మంది బిల్డర్లకు సంబంధించిన ప్రాంతాలపై సిబిఐ దాడులు చేసింది.

దేశంలో సిబిఐ నమోదు చేసిన అతిపెద్ద బ్యాంకింగ్ మోసం కేసు ఇదే. గతంలో ఎబిజి షిప్‌యార్డ్‌లో రూ.22,842 కోట్ల బ్యాంకింగ్ మోసం జరిగింది. బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన రూ.34,615 కోట్ల రుణం మోసం కేసులో డిహెచ్‌ఎఫ్‌ఎల్ సిఎండి కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, 6 రియల్ ఎస్టేట్ కంపెనీలపై సిబిఐ కేసు నమోదు చేసింది. 2021లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌పై రూ.40,623 కోట్ల బ్యాంకింగ్ మోసంపై దర్యాప్తు చేయాలని సిబిఐని కోరింది. 2022 ఫిబ్రవరి 11న ఫిర్యాదును స్వీకరించిన తర్వాత సిబిఐ తన దర్యాప్తును ప్రారంభించింది. యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కూడా మోసం కేసులో జైలుకు వెళ్లాడు. రాణా ప్రస్తుతం ముంబైలోని తాజోలా జైలులో ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News