Sunday, January 19, 2025

భారీ మైనార్టీ స్కాలర్ షిప్ స్కామ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అతి భారీ మైనార్టీ స్కాలర్‌షిప్‌ల కుంభకోణాన్ని ఛేదించారు. మైనార్టీ సంస్థలుగా ఏర్పాటు కావడం, వీటి ద్వారా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను కాజేసి తినేయడం తంతుగా మారింది. ఇటువంటి మైనార్టీ విద్యాసంస్థలలో 53 శాతం వరకూ నకిలీవేనని వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారు. గడిచిన ఐదు సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో పుట్టుకొచ్చిన ఇటువంటి సంస్థలతో దాదాపుగా రూ 144.83 కోట్ల స్కామ్ జరిగింది. జరిగిన వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దీనిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారు. సంబంధిత వ్యవహారంపై ఈ ఏడాది జులై 10వ తేదీన కేంద్ర మైనార్టీ మంత్రిత్వశాఖ తొలుత అధికారికంగా ఫిర్యాదు చేసింది. 34 రాష్ట్రాలలో దాదాపుగా 100 జిల్లాల వరకూ ఈ గోల్‌మాల్ జరిగింది. మొత్తం 1572 సంస్థల కార్యకలాపాలపై విచారణ జరపగా వీటిలో 830 వరకూ అక్రమ కార్యకలాపాలను సాగించినట్లు వెల్లడైంది.

ఆయా మైనార్టీ సంస్థల ఆస్తులను, ఖాతాలను స్తంభింపచేశారు. మొదటి తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చే పథకాన్ని 2007 2008 విద్యాసంవత్సరంలో ఆరంభించారు. దీని పరిధిలో మైనార్టీ విద్యార్థులకు పారితోషికాలు ఇవ్వాలి. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 62 సంస్థలు నకిలీవి, స్కాలర్‌షిప్‌లు తీసుకోవడానికే వెలిసినవిగా తేలింది. రాజస్థాన్‌లో 128 సంస్థలను స్క్రూటిని చేయగా వీటిలో 99 వరకూ ఉనికిలోనే లేనట్లు గుర్తించారు. ఇక కేరళలోని మల్లాపురంలో ఓ బ్యాంకు ద్వారా 66,000 స్కాలర్‌షిప్‌లు పంపిణీ జరిగింది. అయితే ఇక్కడ అర్హులైన మైనార్టీ విద్యార్థులతో పోలిస్తే స్కాలర్‌షిప్‌లు మంజూరు అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అనంత్‌నాగ్‌లో కూడా ఇదే జరిగింది. ఇక ఓ చోట తల్లిదండ్రుల పేరిట ఉన్న ఓ సెల్‌ఫోన్ నెంబరుకు తొమ్మిదో తరగతికి చెందిన 22 మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల వివరాలు అందాయి. ఈ విధంగా ఈ వ్యక్తి ఈ స్కాలర్‌షిప్‌లను పొందాడని వెల్లడైంది.

ఇక మరో సంస్థకు హాస్టల్ లేకున్నా, హాస్టల్ స్కాలర్‌షిప్ పరిధిలో అందరు విద్యార్థులకు డబ్బులు అందినట్లు రికార్డులు ఉన్నాయి. అసోంలో ఓ బ్యాంకు శాఖ ద్వారా 66 వేల స్కాలర్‌షిప్‌లు అందాయి. అయితే నిర్థారణ బృందం వెళ్లగా అక్కడి మదర్సా నుంచి బెదిరింపులు వెలువడ్డాయి. పంజాబ్‌లో అయితే స్కూళ్లలో విద్యార్థులు చేరకుండానే మైనార్టీ విద్యార్థుల పేరిట స్కాలర్‌షిప్‌లు అందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News