Tuesday, September 17, 2024

రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్

- Advertisement -
- Advertisement -
bihar assembly election final stage polling tomorrow
78 అసెంబ్లీ స్థానాలలో 1204 మంది అభ్యర్థులు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మూడవ, తుది దశ పోలింగ్ శనివారం జరగనున్నది. 78 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న తుది దశ పోలింగ్‌లో దాదాపు 2.34 కోట్ల మంది వోటర్లు తమ వోటు హక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్, రాష్ట్ర క్యాబినెట్‌లోని 12 మంది మంత్రులతో సహా మొత్తం 1204 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రజా వ్యతిరేకను తట్టుకుని తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్‌డిఎ శ్రమిస్తుండగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆర్‌జెడి సారథ్యంలోని మహా గట్బంధన్ గట్టి పోరాటాన్నే చేస్తోంది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి.

జెడి(యు) సిట్టింగ్ ఎంపి బైద్యనాథ్ మహతో మరణం కారణంగా వాల్మీకి నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అనివార్యమైన ఉప ఎన్నికకు కూడా శనివారం నాడే పోలింగ్ జరగనున్నది. ఈ స్థానాన్ని తిరిగి సంపాదించడానికి జెడి(యు) మహతో కుమారుడు సునీల్ కుమార్‌ను బరిలో నిలబెట్టగా రాజకీయనేతగా మారిన జర్నలిస్టు ప్రవేశ్ కుమార్ మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థిగా గట్టి పోటీ ఇస్తున్నారు. గంగా నదికి ఉత్తరాన ఉండే 19 జిల్లాలలో శనివారం పోలింగ్ జరగనున్న 78 అసెంబ్లీ నియోజకవర్గాలు వ్యాపించి ఉన్నాయి.

ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాలలో అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎఐఎంఐఎం కూడా గోదాలోకి దిగడంతో కొన్ని చోట్ల పోటీ తిముఖంగా మారింది. హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కూడా కొన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా..మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సోషలిస్టు నాయకుడు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్ తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో బిహారీ గంజ్ అసెంబ్లీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరి దశ పోలింగ్ శనివారం ముగిసిపోనుండగా నవంబర్ 10న వోట్ల లెక్కింపు జరగనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News