Thursday, November 14, 2024

బీహార్‌లో 65 శాతం కోటా సంబంధిత బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్‌లో 65 శాతం కులాలవారి కోటాకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో గురువారం తీసుకువచ్చిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలు, అత్యంత పేదరికంలో ఉన్న బిసిలకు రాష్ట్ర ప్రభుత్వోద్యోగాలలో, విద్యాసంస్థలలో 65 శాతం రిజర్వేషన్ల కేటాయింపులకు ఈ బిల్లును ఉద్ధేశించారు. రిజర్వేషన్ల కోటా 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు నుంచి నిర్ధేశిత రూలింగ్ ఉంది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించడం సుప్రీంకోర్టు పరిమితిని దాటినట్లు అయింది. అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సంతకంతో ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. తరువాత ఇది కోటా పెంపు చట్టంగా మారుతుంది. ఇప్పుడున్న కోటా చట్టానికి సవరణల బిల్లును ఇప్పటి అసెంబ్లీ సెషన్‌లోనే తీసుకువస్తామని రెండుమూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు గురువారం ఈ బిల్లు తీసుకువచ్చారు. రాష్ట్రంలో కులగణన క్రమంలో పలు సామాజిక వర్గాల ఆర్థిక సామాజిక పరిస్థితి గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకుని ఆయా కులాలు వర్గాలకు కోటా పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఈ బిల్లు ప్రవేశపెట్టే దశలో తెలిపారు.

సిఎం సెక్స్ వ్యాఖ్యలపై నిరసనల వేడి నడుమే
మహిళలపై వివాదాస్పదమైన లైంగిక వ్యాఖ్యలకు దిగి చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి నితీశ్‌కు గురువారం కూడా అసెంబ్లీలోపలా, వెలుపల తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు, ప్రత్యేకించి మహిళా సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు ఇతరత్రా గందరగోళానికి దిగిన దశలోనే సవరణల బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది.
సవరణలతో ఇకపై ఉండే కోటాల వివరాలు
ఇప్పుడు బీహార్ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుతో రాష్ట్రంలోని వివిధ కులసామాజిక వర్గాలకు దక్కే కోటాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
షెడ్యూల్ కులాలకు (ఎస్‌సి) 20 శాతం (ఇప్పటివరకూ ఇది 16శాతంగా ఉంది)
ఒబిసిలకు 18 శాతం రిజర్వేషన్లు (ఇప్పటివరకూ ఇది 12 శాతంగా ఉంది)
ఇబిసిలకు 25 శాతం రిజర్వేషన్లు (ఇప్పటివరకూ ఇది 18శాతంగా ఉంది)
షెడ్యూల్ తెగలకు 2 శాతం రిజర్వేషన్లు ( ఇప్పటివరకూ ఇది 1 శాతంగా ఉంది)
బిసిలలో మహిళా కోటాపై వేటు
నితీశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో మహిళకు బిసిల కోటాలో ఇప్పటివరకూ ఉన్న 3 శాతం ఉపవర్గీకరణ రద్దు చేశారు. బిసిలు, ఇబిసిలకు ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమంలో ఎటువంటి రాజీలేకుండా వ్యవహరించే తమ విధానాన్ని ఈ నేపథ్యంలో నితీశ్ చాటుకున్నారు. కాగా తన స్థానం పదిలం చేసుకునేందుకు కంటితుడుపుగా ఈ కోటా అయింట్మెంటు పద్థతిని పాటించిన సిఎం నితీశ్ మహిళల పట్ల తనకు ఉన్న దుర్నితిని, వారి పట్ల చులకన భావాన్ని రెండు రోజులు తిరగకుండానే చాటుకున్నారని బిజెపి ఇతర పార్టీలు మండిపడ్డాయి.

మాకు అందిన చిట్టా మేరకు సమగ్ర చర్యలు ః నితీశ్
ఇప్పుడు ఈ కోటాను తాము ఆషామాషీగా తీసుకురాలేదని , తమకు సమగ్ర సర్వే తేల్చిన గణాంకాల క్రమంలో అందిన వివరాలకు అనుగుణంగా స్పందించామని బీహార్ సిఎం నితీశ్ తెలిపారు. కేవలం ఈ బిల్లునే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, ఇతరత్రా వెనుకబడి ఉన్న వారిని మరింతగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని నితీశ్ తెలిపారు. బీహార్ తొలిసారిగా కులగణనకు దిగిన రాష్ట్రంగా ఘనత దక్కించుకుందని, ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కులాల వారిగా జనాభా లెక్కలకు దిగుతుందని ఆశిస్తున్నామని సిఎం తెలిపారు. అప్పుడు అన్ని వర్గాల పరిస్థితులపై సరైన అధ్యయనం జరిగి దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లపెంపుదలకు వీలేర్పడుతుందని , ఇది కేంద్రంపట్ల తన ఆశ అన్నారు. ఈ సందర్భంగా తాము బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించితీరాలనే డిమాండ్ కూడా చేస్తున్నామని చెప్పారు. ఈ బీహార్ భూమి ప్రాచీనకాలంలో నాగరికతతో, ఆర్థిక పరిపుష్టితో విలసిల్లిందని, ఇది చరిత్ర అని, అయితే పలు చారిత్రక కారణాలతో ఈ విజయపథం ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్పోయిన బీహారీ పూర్వవైభవం తిరిగి పొందేందుకు ప్రత్యేక సాయం అవసరం అని, బీహార్‌కు ఈదిశలో ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉందని సిఎం డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News