Wednesday, January 22, 2025

దేవుళ్లను పూజించకపోతే నష్టం లేదు

- Advertisement -
- Advertisement -

Bihar BJP MLA Questions Hindu Faith

బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పాట్నా: హిందువుల మనోభావాలు గాయపరిచే రీతిలో హిందూ దేవుళ్లు, దేవతలపై బీహార్‌కు చెందిన ఒక బిజెపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో బిజెపి ఇరకాటంలో పడగా ప్రతిపక్షాలు దీన్ని ఆసరాగా చేసుకుని ఆ పార్టీపై విరుచుకుపడుతున్నాయి. భగల్‌పూర్ జిల్లాలోని పీర్‌పైంటి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ గతవారం మరణించిన తన తల్లి సంస్మరణార్థం వైకుంఠ సమారాధన చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆంజనేయస్వామి తదితర దేవతలకు పూజలు చేయనివారు కూడా సరిసంపదలు, విద్య, శక్తి వంటివి అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

మృత్యుభోజ్(వైకుంఠ సమారాధన) చేయడంలోని హేతుబద్ధతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాతోపాటు వార్తా ఛానళ్లలో కూడా ప్రసారమై వైరల్ అయ్యాయి. లక్ష్మీ, సరస్వతీ అమ్మవార్లను ముస్లింలు, క్రైస్తవులు పూజించరని, దీని వల్ల ఆ మతాలవారు సిరిసంపదలను, చదువులను కోల్పోలేదని ఆయన అన్నారు. అమెరికాలో ఆంజనేయస్వామిని పూజించరని, అయినప్పటికీ ఆ దేశం అత్యంత శక్తివంతమైనదని, ఇదంతా కేవలం విశ్వాసం మాత్రమేనంటూ లలన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కొన్ని హిందూ సంస్థలు మండిపడుతూ భగల్‌పూర్ పట్టణంలో ఎమ్మెల్యే లలన్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి బిజెపి నాయకులు నిరాకరిస్తుండగా హిందూ దేవుళ్లు, దేవతలను పూజించే వారి వోట్లు ఆ ఎమ్మెల్యేకు ఇక అవసరం ఉండకపోవచ్చంటూ ఆర్‌జెడి ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News