Thursday, January 23, 2025

బీహార్‌లో రాజుకుంటున్న ప్రత్యేక హోదా చిచ్చు

- Advertisement -
- Advertisement -

బీహార్‌కు ప్రత్యేక తరగతి హోదా(ఎస్‌సిఎస్) ఇవ్వాలన్న డిమాండుపై బీహార్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జెడియు ఒక పక్క డిమాండు చేస్తుండగా బిజెపి నుంచి ఎటువంటి స్పందన లభించకపోవడంపై బీహార్‌లోని ప్రతిపక్ష మహాగట్బంధన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ వివాదం ఢిల్లీ పెద్దలకు తలనొప్పిగా మారే అవకాశం కనపడుతోంది. బీహార్ నుంచి విడగొట్టి జార్ఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయడంతో ప్రత్యేక హోదా డిమాండు తెరపైకి వచ్చింది. ఖనిజ సంపదంతా జార్ఖండ్‌కు వెళ్లిపోవడంతో ఆర్థికంగా నష్టపోయిన బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో డిమాండు చేస్తుండగా 14వ ఆర్థిక సంఘం ఈ సౌకర్యాన్ని రద్దు చేయడం వల్ల ప్రత్యేక మోదాను ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజా లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ స్పందిస్తూ బిజెపి-జెడియు కూటమిపై విమర్శలు గుప్పించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తాను ఆధారపడిన మిత్రపక్షం జెడియు డిమాండును పట్టించుకోకపోవడం విచిత్రమని ఎద్దేవా చేశారు. గత నెల జరిగిన జెడియు జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని ఆమె ప్రస్తావిస్తూ గతంలో అనేకసార్లు వేరుపడి, తిరిగి కలుస్తూ వస్తున్న తన మిత్రుడు, జెడియు అధినేత నితీశ్ కుమార్ పట్ల ప్రధాని మోడీ కొద్దిపాటి గౌరవమైనా ఇవ్వాలని ఆమె వ్యాఖ్యానించారు. కాగా..రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ సిన్హా, మరో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సామ్రాట్ చౌదరితో కలసి బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకుని తమ రాష్ట్రానికి అవసరమైన నిధులపై చర్చించారు. దీనిపై విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వికసిత భారత్ తన లక్షమని ప్రధాని మోడీ చెప్పారని, బీహార్ కూడా అభివృద్ధి చెందినపుడే అది సాధ్యమని అన్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఆయన సూటిగా జవాబు చెప్పలేదు.

కాగా..రాష్ట్ర జెడియు మంత్రి, శ్రమణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండును విస్మరించిందని చెప్పారు. బీహార్‌కు ప్రధాని మోడీ న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఆర్‌జెడి ఎమ్మెల్యే భౠయ్ వీరేంద్ర మాట్లాడుతూ అధికార ఎన్‌డిఎ, బిజెపి కూమి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, జెడియు అవసరమైన చర్యలు తీసుకోవడం మాని ప్రత్యేక హోదా కోసం డిమాండు చేస్తున్నాయని, ప్రజలను వెర్రివాళ్లుగా ఆ పార్టీలు భావిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 2000 సంవత్సరంలో జార్ఖండ్‌ను ఏర్పాటు చేసినపుడు అప్పుడు బీహార్‌లో అధికారంలో ఉన్న రబ్రీ దేవి ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మొట్టమొదటిసారి డిమాండు చేసిందని ఆయన గుర్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News