Thursday, January 23, 2025

కులాల లెక్కలు

- Advertisement -
- Advertisement -

గాంధీ జయంతి నాడు బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన ఆ రాష్ట్ర కుల గణన ఫలితాలు భారతీయ జనతా పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ వంటివని అనడం వాస్తవ దూరం కాబోదు. మరింత సునిశితమైన హిందుత్వ ఆయుధంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి దేశాధికారాన్ని చేపట్టాలని వ్యూహ రచన చేసుకొన్న ఆ పార్టీకి ఇది మింగుడు పడని పరిణామమే. హిందూ సమాజంలోని కుల వ్యత్యాసాలు, వివక్ష వల్ల కుంగి కునారిల్లిపోతున్న మెజారిటీ జనాభా అయిన అణగారిన వర్గాలను హిందూత్వ దారంతో ఒకటిగా కుట్టి తన బుట్టలో వేసుకోగలిగిన బిజెపికి ఇది ఆందోళనకరమే.

విద్య, ఉద్యోగాల్లో, రాజకీయ ప్రాతినిధ్యంలో, అభివృద్ధి ఫలాల్లో తమ జనసంఖ్య మేరకు తమకు వాటా దక్కాలన్న డిమాండ్‌తో ఒబిసిలు ముందుకు వస్తే అది రెండవ మండల్ ఉద్యమంగా దేశాన్ని ఉడికించి తమ ఉనికిని దెబ్బ తీస్తుందని కమలనాథులు భయపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కులాల వారీ జన గణన జరిపించవలసిందని ప్రధాని మోడీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బృందం స్వయంగా కలిసి అర్థించినప్పుడు కూడా చలనం లేకుండా ఆయన దానిని ఎందుకు తిరస్కరించారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ ప్రజలు తాము ముందుగా హిందువులం అనుకొన్నంత కాలమే బిజెపి పప్పులు ఉడుకుతాయి.

ఈ దేశ కుట్రపూరిత కుల వ్యవస్థ చట్రంలో అన్నింటికీ దూరమై అథమ శ్రేణి బతుకులు బతుకుతున్నామని వారు గుర్తిస్తే తమ కోటలు కూలుతాయన్న భయంతోనే బిజెపి పాలకులు కుల గణనకు ససేమిరా అంటూ వచ్చారు. ఇంతకు ముందు కాంగ్రెస్ హయాంలో దేశ వ్యాప్తంగానూ, అందుకు పెడగా కొద్ది రాష్ట్రాల్లో విడివిడిగానూ సామాజిక సర్వేలు జరిగినప్పటికీ అవి బహిర్గతం కాలేదు. వాటికి భిన్నంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటుకొని రూ. 500 కోట్ల ఖర్చుతో నితీశ్ కుమార్ ప్రభుత్వం కుల గణనను జరిపించి దాని ఫలితాలను అధికారికంగా ప్రకటించడం దేశ రాజకీయాల్లో కొత్త మలుపుకి నాందీగా భావించవచ్చు. గతంలో 1931లో బ్రిటిష్ హయాంలో దేశంలో చిట్టచివరి కుల గణన జరిగింది.

అగ్ర వర్ణ ఆధిపత్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని మళ్ళీ చేపట్టడానికి ఉత్సాహం చూపలేదు. ఒబిసిలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనే వారి హయాంలో జరగలేదు. మండల్ నివేదికను చిరకాలం పాటు అణగదొక్కి బూజు పట్టించారు. బీహార్ కుల గణన ప్రకారం ఆ రాష్ట్రంలో ఒబిసిలు 63.1 శాతమని తేలింది. ఇతర చాలా రాష్ట్రాల్లో వారి జనాభా ఇలాగే వుండే అవకాశమున్నది. లాలూ ప్రసాద్ యాదవ్ కులమైన యాదవులు అత్యధికంగా 14.2 శాతం వుండగా, అత్యంత వెనుకబడిన తరగతులు 36 శాతం వున్నట్టు వెల్లడైంది. ఈ వర్గాన్నే ఎంబిసిలుగా కూడా పరిగణిస్తున్నారు. నితీశ్ కుమార్ వీరి మద్దతుతోనే చిరకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ వచ్చారు.

అయితే గత బీహార్ శాసన సభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీని బిజెపి దొడ్డి దారిలో దెబ్బ తీయడానికి ఈ వర్గాలు పాక్షికంగానైనా ఆయనకు దూరం కావడమే కారణమైతే అయి వుండవచ్చు. సైద్ధాంతిక నిబద్ధత లేకుండా పరస్పర విరుద్ధ శక్తులతో చెలిమి చేసి అధికారంలో కొనసాగడమే ధ్యేయం అనుకొన్నందుకే నితీశ్ కుమార్ దెబ్బ తిన్నారని చెప్పవచ్చు. ఇప్పుడయితే ఆయన బిజెపి వ్యతిరేక ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు ఊపిరిగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కులాల వారీ జన గణనను దేశ వ్యాప్తంగా జరిపి తీరాలని, తాము అధికారంలోకి వస్తే ఆ పని చేస్తామని ప్రకటించడం విశేషం. ప్రధాని మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన పోస్టు డేటెడ్ చెక్ వంటి మహిళల రిజర్వేషన్ చట్టంలో బిసి మహిళలకు వాటా కల్పించలేదు. గతంలో ఇందుకు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దీనిని కూడా డిమాండ్ చేస్తున్నది.

చిరకాలం అగ్రవర్ణాలు, ఎస్‌సి, ముస్లిం ఓట్ల బలంతో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌కు ఇప్పుడు పాదాల కింద నేల కదిలిపోయింది. ఆ వర్గాలు దానికి దూరమయ్యాయి. అందుచేత ఇంత కాలం తాను ఉపేక్షించిన ఒబిసి ఓటు బ్యాంకును ఇప్పుడు ఆశ్రయించక తప్పడం లేదు. భారతీయ జనతా పార్టీ హిందూత్వ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఒబిసి ఓటును ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. కుల గణన కఠోర వాస్తవాల నేపథ్యంలో అది ఏమి చేస్తుందో చూడాలి. కులం ఒక వాస్తవంగా, ఇంకా చెప్పాలంటే కుల వివక్ష ఒక కఠోరమైన సత్యంగా వున్న సమాజంలో కులాల వారీ జన గణన డిమాండ్‌ను తోసి పుచ్చడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఏడున్నర శతాబ్దాల స్వతంత్ర భారతంలో కుల రహిత సమాజ స్వప్నం ఛిద్రమైపోయింది. దాని సాక్షాత్కారం కనుచూపు మేరలో లేదు. సోషలిస్టు తరహా సమాజ నిర్మాణ లక్షం కూడా నామరూపాలు లేకుండా పోయి కార్పొరేట్ శక్తుల హవా నడుస్తున్నది, సంపద కేంద్రీకరణ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మెజారిటీ ప్రజలు కులాన్ని ఆశ్రయించడాన్ని తప్పు పట్టలేము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News